శాతకర్ణిలో చెప్పిందంతా పచ్చి అబద్ధమంటున్న చరిత్రకారులు

First Published Jan 17, 2017, 8:42 AM IST
Highlights
  • గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలో చూపిందంతా తప్పంటూ విమర్శలు
  • శాతకర్ణి చరిత్రను తప్పుదోవ పట్టించారంటున్న చరిత్రకారులు
  • శాతకర్ణి భారత దేశమంతా పాలించలేదంటున్న నిపుణులు

శాతవాహన చక్రవర్తి శాతకర్ణి గురించి నందమూరి బాలకృష్ణ, శ్రియ నటీనటులుగా క్రిష్ దర్శకత్వంలో వచ్చిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో కథ మూలంలోనే అవాస్తవాలు ఉన్నాయని తెలంగాణ అసోసియేషన్ నాయకులు, పలువురు చరిత్రకారులు చెబుతున్నారు.

వాయిస్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడు కెప్టెన్ పాండురంగా రెడ్డి ఆధ్వర్యంలో పలువురు చరిత్రకారులు ఈ సినిమా ఓ చారిత్రక అబద్దం అని తీవ్రంగా విమర్శించారు. అవాస్తవాలతో సినిమాలు తీసి అవే నిజాలని నమ్మించే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. అవాస్తవాలతో సినిమా తీశారు కాబట్టి... ఈ సినిమాకు రాయితీగా ఇచ్చిన వినోదపు పన్ను మినహాయింపును వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ఇది హిస్టారికల్ సినిమా అని వారు చెప్పుకోవచ్చు కానీ అది కేవలం కల్పితమని వారు స్పష్టం చేశారు. శాతకర్ణి చారిత్రక అబద్దమని, అవాస్తవాలు, కల్పిత కథతో చిత్రాన్ని తెరకెక్కించారన్నారు. వాయిస్‌ ఆఫ్‌ తెలంగాణ అధ్యక్షుడు  కెప్టెన్‌ ఎల్‌ పాండురంగారెడ్డి, హైదరాబాద్‌ డక్కెన్‌ డెమోక్రటిక్‌ అలయన్స్‌ అధ్యక్షుడు డాక్టర్‌ కొల్లూరి చిరంజీవి, తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరం ప్రతినిధి డీపీ రెడ్డిలు హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త తరానికి సినిమాలో గౌతమిపుత్రుని చరిత్ర గురించి అవాస్తవాలు చెప్పారని మండిపడ్డారు. శాతకర్ణి అసలు కోటి లింగాలలో పుట్టనేలేదని, ఆయన తల్లి బాలాశ్రీ వేయించిన శాసనాల్లో ఈ విషయం లేదని వాళ్లు చెబుతున్నారు.

 

కేవలం దక్కన్ పీఠభూమిని మాత్రమే పాలించిన శాతకర్ణి, దేశమంతటినీ పాలించినట్టు చూపెట్టడమేంటని వారు నిలదీస్తున్నారు. శాతకర్ణి అసలు తెలంగాణ వ్యక్తి కాదని చెప్పారు. సినిమాలో ఎన్నో అవాస్తవాలు చెప్పారన్నారు. దీనిపై చర్చకు సిద్ధమని వారు ప్రకటించారు. కేవలం డబ్బు కోసం చరిత్రను తప్పుదోవ పట్టించొద్దని, గౌతమిపుత్ర శాతకర్ణి కల్పితమని ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

click me!