
మలయాళంలో ఘనవిజయం సాధించిన టూ కంట్రీస్‌కు రీమేక్ సినిమానే శంకర్ రూపొందిస్తున్న ఈ మూవీ. పూజా కార్యక్రమాల అనంతరం చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ క్లాప్‌నివ్వగా, విద్యుత్‌శాఖ మంత్రి జి. జగదీష్‌రెడ్డి కెమెరా స్విఛాన్ చేశారు. తొలి సన్నివేశానికి దాసరి నారాయణరావు గౌరవ దర్శకత్వం వహించారు.
చిత్రసీమలో సునీల్ స్వయంకృషితో ఎదిగారు. మలయాళంలో ఈ చిత్రం అద్భుతమైన విజయాన్ని సాధించింది. మాతృకలో నటించిన దిలీప్, సునీల్ శారీరక భాషలో సారూప్యాలుంటాయి. అందుకే సునీల్‌ను కథానాయకుడిగా ఎంచుకున్నాం. వినోదంతో పాటు మానవీయ అంశాలున్న చిత్రమిది. మాటల రచయిత శ్రీధర్ సీపాన హృదయానికి హత్తుకునే సంభాషణల్ని రాశారు. ప్రతిభావంతులైన టీమ్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. డిసెంబర్ మొదటివారంలో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం. 70శాతం అమెరికాలో చిత్రీకరణ జరుపుతాం అని దర్శకుడు ఎన్.శంకర్ తెలిపారు.
ఆద్యంతం హాస్యరసభరితంగా సాగే చిత్రమిదని, సకుటుంబంగా ప్రేక్షకుల్ని అలరించే చిత్రమవుతుందని సునీల్ చెప్పారు. ఎలాంటి ద్వంద్వార్థాలు లేకుండా సంభాషణలన్ని ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయని, భావోద్వేగభరితమైన డైలాగ్స్ రాసే అవకాశం లభించిందని మాటల రచయిత శ్రీధర్ సీపాన పేర్కొన్నారు.
శంకర్ దర్శకత్వం వహించిన తొమ్మిది చిత్రాల్లో ఎనిమిది భారీ విజయాలుగా నిలిచాయని, జై బోలో తెలంగాణ చిత్రం ద్వారా ఆయన తెలంగాణ రుణం తీర్చుకున్నారని ఆర్.నారాయణమూర్తి కొనియాడారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సి.రామ్‌ప్రసాద్, సంగీతం: గోపీసుందర్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్, రచన: శ్రీధర్ సీపాన, సమర్పణ: సాయి, నిర్మాత, దర్శకుడు: ఎన్.శంకర్.