
ఏఎన్నార్ నటించిన 'దేవదాసు' సినిమాలో విషాదగీతం 'అంతా భ్రాంతియేనా.. జీవితానా వెలుగింతేనా' పాట ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఇప్పటికీ సినిమాలలో కొన్ని సన్నివేశాల్లో ఆ పాట వినిపిస్తూనే ఉంది.
అంతగా తన గాత్రంతో తెలుగు వారికి దగ్గరైన గాయని రాణి(75) మరణించడం టాలీవుడ్ ను కంటతడి పెట్టించింది. గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధ పడుతున్న రాణి.. శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో చివరిశ్వాస విడిచారు. హైదరాబాద్ లో కళ్యాణ్ నగర్ లో తన కుమార్తె విజయతో కలిసి జీవిస్తోన్న రాణి దాదాపు 500లకు పైగా పాటలను ఆలపించారు.
తొమ్మిదేళ్ల వయసులోనే తన సంగీత ప్రయాణాన్ని మొదలుపెట్టిన రాణి తన కెరీర్ లో శ్రీలంక జాతీయగీతాన్ని ఆలపించడం, రాష్ట్రపతి భవన్ లో ప్రదర్శన ఇవ్వడం వంటి ఎన్నో ఘనతలను సాధించారు. ఆమె మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.