లెజెండరీ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ ఇకలేరు

By team teluguFirst Published Sep 21, 2021, 10:00 AM IST
Highlights

సీనియర్ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ మంగళవారం (సెప్టెంబర్ 21) తెల్లవారు జామున నాలుగు గంటలకు చెన్నైలో పరమపదించారు. నాలుగు దశాబ్దాలు ఈశ్వర్, చిత్ర పరిశ్రమకు సేవలు అందించారు.

టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ మంగళవారం (సెప్టెంబర్ 21) తెల్లవారు జామున నాలుగు గంటలకు చెన్నైలో పరమపదించారు. నాలుగు దశాబ్దాలు ఈశ్వర్, చిత్ర పరిశ్రమకు సేవలు అందించారు. ఆయన పూర్తిపేరు కొసనా ఈశ్వరరావు. వయసు 84 సంవత్సరాలు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు ఆయన స్వస్థలం.

బాపు దర్శకత్వం వహించిన 'సాక్షి' (1967) సినిమాతో పబ్లిసిటీ డిజైనర్‌గా ఈశ్వర్ ప్రయాణం ప్రారంభమైంది. ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు. సుమారు 40 ఏళ్ల పాటు నిర్విరామంగా పనిచేశారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం ,హిందీ భాషల్లో 2600లకు పైగా చిత్రాలకు పని చేశారు.  విజయా , ఏవీయం, జెమినీ, అన్నపూర్ణ,  గీతా ఆర్ట్స్,  సురేష్ ప్రొడక్షన్స్ , వైజయంతి తదితర అగ్ర నిర్మాణ సంస్థలకు ఆయన పబ్లిసిటీ డిజైనర్‌గా పని చేశారు. పలు ప్రముఖ నిర్మాణ సంస్థల లోగోలను ఆయన డిజైన్ చేశారు. 'దేవుళ్ళు' ఆయన పని చేసిన ఆఖరి చిత్రం. ఈశ్వర్ గారి సహకారంతోనే ఆయన సోదరులు బ్రహ్మం అనూ గ్రాఫిక్స్ కోసం తెలుగు ఫాంట్ లను  రూపొందించారు.

ఈశ్వర్ రాసిన 'సినిమా పోస్టర్' పుస్తకానికి ఉత్తమ సినిమా గ్రంథ రచన విభాగంలో 2011లో నంది పురస్కారం లభించింది. చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గాను 2015లో ఆయన్ను రఘుపతి వెంకయ్య పురస్కారంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సత్కరించింది. ఆయన భార్య పేరు వరలక్ష్మి. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు .

పలు చిత్రాలకు తన డిజైన్స్ ద్వారా ప్రచారం కల్పించిన ఈశ్వర్ తిరిగిరాని లోకాలకు వెళ్లడం బాధాకరమని నందమూరి బాలకృష్ణ అన్నారు.‌ ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ మంగళవారం ఉదయం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల బాలకృష్ణ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా తాను కథానాయకుడిగా నటించిన కొన్ని చిత్రాలకు ఈశ్వర్ పని చేశారని, ఆయనతో తనకు మంచి అనుబంధం ఉందని బాలకృష్ణ గుర్తు చేసుకున్నారు. ఈశ్వర్ ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు.

click me!