పరిశ్రమలో మరో విషాదం, కరోనాకు బలైన దాసరి శిష్యుడు!

By team teluguFirst Published May 13, 2021, 9:50 AM IST
Highlights

 టాలీవుడ్ కి చెందిన సీనియర్ దర్శకుడు కరోనా సోకి మృతి చెందారు. దర్శకుడు అక్కినేని వినయ్‌ కుమార్‌ కరోనాతో మృతి చెందారు.

కరోనా ఒక్కొక్కరిగా చిత్ర పరిశ్రమ ప్రముఖులను బలితీసుకుంటుంది. ఇప్పటికే అనేక మంది దర్శక నిర్మాతలు, నటులు, సాంకేతిక నిపుణులు కరోనాకు బలయ్యారు. తాజాగా టాలీవుడ్ కి చెందిన సీనియర్ దర్శకుడు కరోనా సోకి మృతి చెందారు. దర్శకుడు అక్కినేని వినయ్‌ కుమార్‌ కరోనాతో మృతి చెందారు. 65ఏళ్ల వినయ్ కుమార్ ఇటీవల అనారోగ్యం పాలయ్యారు. 


వైద్య పరీక్షల్లో ఆయనకు  కరోనా అని తేలింది. దీనితో ఓ  ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం జాయిన్ అయ్యారు. అయితే వినయ్ కుమార్ పరిస్థితి విషమించడంతో ఆయన మరణించడం జరిగింది. వినయ్ కుమార్ కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.  ఏడంస్తుల మేడ సినిమా నుంచి దాసరి నారాయణ రావు వద్ద శిష్యరికం చేసిన ఆయన పవిత్ర అనే సినిమాకు దర్శకత్వం వహించారు.


 రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించిన సుందరవదన సుబ్బలక్ష్మి మొగుడా సినిమాకు నిర్మాణ బాధ్యతలు నిర్వహించారు. ఇటీవలి కాలంలో  అంతరంగాలు, నా మొగుడు నాకే సొంతం, అమ్మ, ఆరాధన వంటి సీరియల్స్‌కు దర్శకత్వం వహించారు. వినయ్‌ కుమార్‌ మృతి పట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని సంతాపం వ్యక్తం చేశారు. మే12న ఒకేరోజు ముగ్గురు సినీ ప్రముఖులు చనిపోవడంతో ఇండస్ర్టీలో విషాదం నెలకొంది.  సంగీత దర్శకుడు కె.ఎస్‌.చంద్రశేఖర్‌.. డబ్బింగ్‌ ఇంఛార్జ్‌ కాంజన బాబు సహా దర్శకుడు అక్కినేని వినయ్‌ కుమార్ కన్నుమూశారు.

click me!