
సినిమా టిక్కెట్ల విషయంలో స్పందించాలంటూ నిన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్‌కు స్పందించారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. తన చిరకాల మిత్రుడి సోదరుడైన పవన్ కల్యాణ్ తనకంటే చిన్నవాడని, అందుకే ఏకవచనంతో సంబోధిస్తున్నానంటూ ట్వీట్ చేశారు. పవన్ కల్యాణ్ గాను అనడంలో కూడా తప్పేమీ లేదన్నారు. ఇప్పుడు మా ఎన్నికలు జరుగుతున్నాయని.. తన కుమారుడు ప్రెసిడెంట్‌గా నిలబడ్డాడని నీకు తెలుసు కదా అంటూ ప్రశ్నించిన మోహన్ బాబు, ఎన్నికల తర్వాత నీవు అడిగిన ప్రతి మాటకు సమాధానం చెబుతానని స్పష్టం చేశారు. ఈలోగా నీవు చేయవలసిన ముఖ్యమైన పని నీ ఓటును విష్ణుబాబుకి, ఆయన ప్యానెల్‌కు వేయాలని మోహన్ బాబు ట్వీట్ చేశారు.
కాగా, నిన్న రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ వేదిక సాక్షిగా పవన్ ఆవేశంతో ఊగిపోయారు. ఆయన పరిశ్రమ పెద్దలు, వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. నిర్మాతలకు చేటు చేసేలా ఉన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించాలని గట్టిగా వాదించారు. ఈ క్రమంలో నిర్మాత దిల్ రాజుపై ఆయన కొంచెం వివాదాస్పద కామెంట్స్ చేశారు. నువ్వు రెడ్డే సీఎం జగన్ రెడ్డే.. మీరు మీరు తేల్చుకోండి. మీ రెడ్డే కదా, వెళ్లి మాట్లాడూ అంటూ విరుచుకుపడ్డారు.
ALso Read:మోహన్ బాబు పేరును ప్రస్తావిస్తూ... వైసీపీ సానుభూతిపరులు ప్రశ్నించాలన్న పవన్
ఇక పరిశ్రమలో ఉన్న వైసీపీ ప్రభుత్వ సానుభూతి పరులను, ఆ పార్టీ కండువా కప్పుకున్నవారిని కూడా పవన్ తన స్పీచ్ లో టార్గెట్ చేశారు. మీరు ఏ పార్టీకైనా మద్దతు ఇవ్వండి. ఆ పార్టీలలో ఉండి నన్ను తిట్టండి. అలా కొందరు తిట్టారు కూడా. కానీ పరిశ్రమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించండి అని పవన్ ఆవేశ పడ్డారు.
నటుడు మోహన్ బాబు పేరును ఆయన నేరుగా ప్రస్తావించారు. పరిశ్రమలో పెద్దలుగా వైసీపీ నిరంకుశ నిర్ణయాల పట్ల స్పందించాలని అన్నారు. పరిశ్రమ అంటే కేవలం దిల్ రాజు, సురేష్ బాబు, అల్లు అరవింద్ కాదని, పరిశ్రమపై ఆధారపడిన ప్రతి ఒక్కరు అన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక మంది చిత్ర పరిశ్రమపై ఆధారపడి బ్రతుకుతున్నారని పవన్ తెలియజేశాడు.