బ్రతికుండగానే చంపేశారు... తన మరణ వార్తలపై ఫైర్ అయిన కోటా శ్రీనివాసరావు!

By Sambi ReddyFirst Published Mar 21, 2023, 10:50 AM IST
Highlights

నటుడు కోటా శ్రీనివాసరావు చనిపోయారంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో ఆయన స్వయంగా వివరణ ఇవ్వాల్సి వచ్చింది. 
 

వయసు పైబడిన నటులు చనిపోయారని వార్తలు రాసుకుని క్యాష్ చేసుకునే బ్యాచ్ ఎక్కువైపోయారు. గతంలో సుమన్, చంద్రమోహన్ తో పాటు పలువురు సినిమా ప్రముఖులు జీవించి ఉండగానే మరణించారంటూ యూట్యూబ్ వీడియోలు వెలువడ్డాయి. ఆ వార్తలపై సదరు నటులు మండిపడ్డారు. తాజాగా ఇదే పరిస్థితి కోటా శ్రీనివాసరావుకు ఎదురైంది. నేటి ఉదయం నుండి ఆయన కన్నుమూశారంటూ సోషల్ మీడియాలో పోస్ట్స్ దర్శనమిచ్చాయి. ఈ క్రమంలో ఆయన వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.

'రేపు ఉగాది కావడంతో పండగ ఎలా నిర్వహించాలని కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నాను. ఉదయం నుండి ఒకటే ఫోన్ కాల్స్. నేనే యాబై కాల్స్ మాట్లాడాను. ఇక నేను మాట్లాడితే బాగోదని ఫోన్ కుటుంబ సభ్యులకు ఇచ్చాను. ఎవడో కోటా శ్రీనివాసరావు కన్నుమూశారని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడట. దారుణమైన విషయం ఏమిటంటే ఓ పది మంది పోలీసులతో కూడిన వాహనం ఇంటి ముందు వచ్చి ఆగింది. నేను ప్రముఖుడిని కాబట్టి నలుగురు వస్తారని బందోబస్తుకు పంపారు. 

తన మరణ వార్తలపై ఫైర్ అయిన కోటా శ్రీనివాసరావు!

pic.twitter.com/Oqzf2mfqAw

— Asianetnews Telugu (@AsianetNewsTL)

నన్ను చూసి ఆ పోలీసులు ఆశ్చర్యపోయారు. ఏంటండీ ఇది అని అడిగారు. నేను కూడా షాక్ లోనే ఉన్నానండి. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయకుండా పోలీసులు మీరే చర్యలు తీసుకోవాలని అన్నాను. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. లోకంలో డబ్బులు సంపాదించాడని అనేక మార్గలు ఉన్నాయి. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి పబ్బం గడుపు కోవద్దు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు...' అంటూ కోటా వీడియో బైట్ విడుదల చేశారు. 

కోటా శ్రీనివాసరావుకు వృద్ధాప్యం రీత్యా అవకాశాలు తగ్గాయి. ఆయన మాత్రం నటించాలని కోరుకుంటున్నారు. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం వెల్లడించారు. నటించడానికి అన్ని విధాలా ఫిట్ గా ఉన్నాను. డైలాగ్ డెలివరీ కూడా బాగుంది. త్రివిక్రమ్ తో పాటు పలువురు దర్శకులను అవకాశాలు ఇవ్వమని ఫోన్లు చేస్తున్నానని చెప్పారు. డబ్బు కోసం కాదు ఇంట్లో పని లేకుండా కూర్చోవడం ఇబ్బందిగా ఉందని చెప్పారు. గత ఏడాది కోటా శ్రీనివాసరావు 'హీరో' చిత్రంలో నటించారు. హీరో మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా డెబ్యూ మూవీ కావడం విశేషం. 
 

click me!