సీనియర్ నటుడు చలపతిరావు(79)కన్నుమూశారు. ఆదివారం తెల్లవారు జామున(శనివారం రాత్రి) ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు చలపతిరావు(79)కన్నుమూశారు. ఆదివారం తెల్లవారు జామున(శనివారం రాత్రి) ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని కుమారుడు దర్శకుడు, నటుడు రవిబాబు వెల్లడించారు. కుమారుడు రవిబాబు ఇంట్లోనే ఆయన మృతి చెందినట్టు తెలిపారు.
టాలీవుడ్‌లో 1200లకుపైగా చిత్రాల్లో నటించి మెప్పించారు చలపతిరావు. విలన్ పాత్రలకు పెట్టింది పేరు. అంతేకాదు తండ్రి పాత్రలు, కామెడీ పాత్రలు, మొత్తంగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్న పాత్రల్లో నటించి మెప్పించారు. కానీ ఆయనకు నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలే బాగా పేరుతెచ్చాయి. సీనియర్ దిగ్గజ నటుల్లో ఒకరిగా నిలిపాయి.
undefined
చలపతిరావు అసలు పేరు తమ్మారెడ్డి చలపతిరావు. ఆయన 1944, మే 8న, కృష్ణాజిల్లా పామర్రు మండలంలోని బల్లిపర్రు గ్రామంలో జన్మించారు. నాన్న పేరు మణియ్య, తఅమ్మ వియ్యమ్మ. ఆయనకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. కుమారుడు రవిబాబు నటుడిగా, దర్శకుడిగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఆయన కూడా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో పేరుతెచ్చుకున్నారు. అదే సమయంలో దర్శకుడిగానూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. కూతుళ్లు అమెరిలో ఉంటున్నారు.
లపతిరావు.. సూపర్‌స్టార్ కృష్ణ నటించిన `గూఢచారి 116` చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఎన్టీఆర్ తో `కథానాయకుడు` చిత్రంలో కీలకపాత్రలో మెప్పించారు. అంతేకాదు ఎన్టీఆర్ సహాయంతో ఇండస్ట్రీలో రాణించారు. వరుసగా ఆఫర్లు అందుకుని స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎదిగారు. 1966లో ప్రారంభమైన ఆయన సినీ జీవితం 2021 వరకు సుధీర్ఘంగా సాగింది. దాదాపు ఐదున్నర దశాబ్దాలపాటు ఆయన సినిమా పరిశ్రమకి సేవలందించారు. ఎన్నో గొప్ప చిత్రాల్లో భాగమయ్యారు. తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పర్చుకున్నారు. చివరగా ఆయన గతేడాది `ఓ మనిషి నీవెవరు` చిత్రంలో నటించారు. గత కొంత కాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు.
చలపతిరావు కుమార్తె అమెరికాలో ఉన్నారు. ఆమె రావడానికి సమయం పడుతుంది. దీంతో బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు నటుడు రవిబాబు తెలిపారు. నేడు(ఆదివారం) మధ్యాహ్నం నుంచి చలపతిరావు భౌతిక కాయాన్ని తన ఇంట్లోనే అభిమానుల సందర్శనార్థం ఉంచుతామని, మూడు గంటల తర్వాత ఆయన పార్థివ దేహాన్ని ఫిల్మ్ నగర్ లోని మహాప్రస్థానంలో ఫ్రీజర్‌లో ఉంచుతామని రవిబాబు వెల్లడిచారు.