
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు ఉన్న ఫాలోయింగ్ వేరే. ఆ ఫాలోయింగే ఆమెను తెలంగాణ రాష్ట్రానికి బ్రాండ్ ఎంబాజిడర్ ను కూడా చేసింది. అయితే సానియా బ్రాండ్ ఎంబాజిడర్ గా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి ఆమె వైఖరి కారణంగా డ్యామేజ్ జరిగేలా ఉంది.
సానియా సేవా పన్నును చెల్లించని వ్యక్తిగానే కాక.. ఆదాయ పన్ను శాఖాధికారులు సమన్లు ఇచ్చే వరకూ సానియా స్పందించకపోవటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ హోదాలో తీసుకుంటున్న పారితోషికానికి ఆమె సేవాపన్ను చెల్లించాల్సి ఉంది. పన్ను చెల్లించకపోవడంతో ఇప్పటికే ఆదాయపన్ను శాఖాధికారులు నోటీసులు జారీ చేసినా.. సానియా స్పందించలేదు. తెలంగాణ రాష్ట్రబ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నందుకు ఆమెకు ఏడాదికి కోటి రూపాయిల చొప్పున తెలంగాణ సర్కారు పారితోషికాన్ని ఇస్తోంది.
ఇలాంటి పారితోషికాలకు చట్టబద్ధంగా పదిహేను శాతం పన్నును చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే సానియాకు లేఖల ద్వారా సమాచారం అందించారు. అయినప్పటికీ ఆమె బకాయిలు చెల్లించకపోవటంతో సర్వీస్ ట్యాక్స్ అధికారులు ఆమెకు సమన్లు జారీ చేశారు. ఈ నెల 16న వ్యక్తిగతంగా కానీ.. ప్రతినిధిని పంపటం ద్వారా కానీ హైదరాబాద్ లోని సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కమిషనరేట్ కు హాజరు కావాలని నోటీసులిచ్చారు.
తెలంగాణ అంబాజిడర్ గా వ్యవహరిస్తున్న సానియా వ్యవహారశైలిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.