
యంగ్ హీరో రానాతో కలిసి పవన్ కళ్యాణ్ ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి స్టార్ డైరక్టర్ త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించనున్నారు. మలయాళ సూపర్‌హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. అక్కడ బిజు మేనన్, పృథ్వీరాజ్‌లు పోషించిన పాత్రలను ఇక్కడ తెలుగులో పవన్, రానా పోషిస్తున్నారు. ఇటీవలే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఇక ఈ చిత్రంలో కీలకమైన పాత్రకు గాను సముద్రఖని ని తీసుకున్నారు. రీసెంట్ గా క్రాక్ సినిమాలో విలన్ గా ఆయన దుమ్మురేపారు. ఈ విషయాన్ని తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసారు.
సముద్ర ఖని మాట్లాడుతూ... ‘‘అల.. వైకుంఠపురములో..’, ‘క్రాక్’ విజయాల తర్వాత తెలుగులో నాకు మంచి అవకాశాలు లభించాయి. రామ్‌చరణ్-తారక్ నటిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’తోపాటు నితిన్, నాని సినిమాల్లో సైతం నేను కీలకపాత్ర పోషించనున్నాను. అంతేకాకుండా పవన్-రానా కలిసి నటిస్తున్న సినిమాలో ఓ పాత్ర కోసం త్రివిక్రమ్ నన్ను సంప్రదించారు. వాళ్లతో కలిసి పనిచేయడం కోసం నేను ఎదురుచూస్తున్నాను. నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్న ప్రేక్షకులను అలరించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తాను’ అని సముద్రఖని తెలియజేశారు.
ఇందులో హీరోయిన్స్ గా సాయి పల్లవి, ఐశ్వర్యరాజేశ్‌లు ఎంపికైనట్లు సమాచారం. దీనిపై చిత్ర టీమ్ అధికారికంగా స్పందించాల్సి ఉంది.
మరోవైపు వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి, వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.