
ప్రస్తుతం బయోపిక్ ల హవా నడుస్తోంది. ముఖ్యంగా క్రీడాకారుల జీవిత కథల ఆధారంగా బయోపిక్ లను తెరకెక్కిస్తున్నారు దర్శకులు. ఇప్పటికే బాగ్ మిల్కా బాగ్, మేరీకోమ్, ఎం ఎస్ ధోని ల జీవిత కథల ఆదారంగా బాలీవుడ్ లో సినిమాలు తెరకెక్కాయి. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవిత కథ ఆధారంగా కూడా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో శ్రద్ధాకపూర్ లీడ్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే మరో క్రీడాకారిణి జీవితం తెరపైకి రానుంది. ఆమె ఇండియన్ మహిళా క్రికెటర్ మిథాలి రాజ్ . ప్రపంచకప్ లో 6వేల పరుగుల పూర్తి చేసిన ఏకైక మహిళా క్రికెటర్ గా గుర్తింపు సాధించిన మిథాలి రాజ్ లైఫ్ ని సినిమాగా తెరకెక్కిస్తుండగా.. వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాని నిర్మించనుంది.
మేరీకోమ్ జీవిత కథ ఆధారంగా.. ప్రియాంక చోప్రా లీడ్ రోల్ లో నటించిన ‘ మేరీకోమ్’ చిత్రానికి కూడా ఈ సంస్థే నిర్మాతగా వ్యవహరించింది. అయితే.. ఈ సినిమాలో మిథాలి పాత్రలో టాలీవుడ్ బ్యూటీ సమంతను ఎంచుకున్నట్లు సమాచారం. అక్టోబర్ 6న సమంత- నాగ చైతన్యల వివాహం జరగనుంది. వివాహం జరిగిన తర్వాత.. సమంత నటించే తొలి చిత్రం ఇదే అనే ప్రచారం సాగుతోంది.
వివిధ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాని వేర్వేరు నటులతో చిత్రీకరిస్తారని.. అందుకే దక్షిణాదిన సమంతను ఎంచుకున్నట్లు సమాచారం. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే.