
ప్రముఖ సినీ నటి సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ వ్యాధి బారి నుంచి సమంత త్వరగా కోలుకోవాలని అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన అనారోగ్యంపై మాట్లాడిన సమంత భావోద్వేగానికి గురయ్యారు. ఇప్పటికీ తాను ఇంకా చావలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆమె కన్నీరు పెట్టుకున్నారు.
వివరాలు.. సమంత తన తాజా చిత్ర యశోద ప్రమోషన్‌లో భాగంగా రూపొందించిన ఇంటర్వ్యూలో పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ‘‘నేను నా పోస్టులో చెప్పినట్టుగా కొన్ని రోజులు మంచిగా ఉంటాయి. కొన్ని రోజులు చెడుగా ఉంటాయి. ఒక్కొక్క రోజైతే ఇంకో అడుగు ముందుకు వేయలేనని అనిపిస్తోంది. కానీ కొన్నిసార్లు తిరిగి చూస్తుంటే ఇంత దాటేసి వచ్చానా? అనిపిస్తుంది’’ అని సమంత ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ సమయంలో ఆమె భావేద్వాగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు.
‘‘నేను ఒక్క దానినే కాదు. చాలా మంది ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నవారు ఉన్నారు. నేను చాలా ఆర్టికల్స్ చూశారు. లైఫ్-థ్రెటెనింగ్ అని వస్తున్నాయి. నేను ఉన్న స్టేజ్‌లో ఇది లైఫ్-థ్రెటెనింగ్ కాదు. ప్రస్తుతానికైతే నేను చావలేదు. అయితే ఇది కష్టంతో కూడుకున్నది. నేను దీనిపై పోరాటం చేయాలి’’ అని సమంత చెప్పారు.
సమంత ప్రస్తుతం మయోసైటిస్ అనే ప్రమాదకర ఆటో ఇమ్యూన్ వ్యాధితో పోరాడుతున్నారు. అయితే ఆమెకు మనో ధైర్యాన్ని ఇస్తూ అభిమానులు, సెలెబ్రిటీలు వరుసగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
ఇక, సమంత నటించిన యశోద చిత్రం నవంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఓవైపు అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ.. సమంత చిత్రంలో తన పాత్ర డబ్బింగ్ పూర్తి చేశారు. తాజాగా సినిమా ప్రమోషన్‌లో భాగంగా తెలుగు, తమిళ భాషల్లో ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇందుకు సంబంధించిన కొన్ని చిత్రాలను సమంత సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. అయితే ఈ ఇంటర్బ్యూలో సమంత చాలా బలహీనంగా కనిపించారు.