Salaar Update: ప్రభాస్‌ ఫ్యాన్స్ కి గుడ్‌న్యూస్‌.. `సలార్‌` క్రేజీ అప్‌డేట్‌.. సంబరాలు షురూ!

By Aithagoni RajuFirst Published Aug 12, 2022, 6:45 PM IST
Highlights

`సలార్‌` సినిమా నుంచి ఆప్‌ డేట్‌ ఇవ్వబోతున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. మరో రెండు రోజుల్లో ఈ అప్‌డేట్‌ రానుందని తెలిపింది.

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్(Prabhas) తన అభిమానులకు ట్రీట్‌ ఇవ్వబోతున్నారు. కొన్నాళ్లుగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ నిరీక్షణ ఫలిస్తుంది. క్రేజీ అప్‌డేట్‌తో రాబోతున్నారు డార్లింగ్. ఆయన నటిస్తున్న `సలార్‌`(Salaar) సినిమా నుంచి ఆప్‌ డేట్‌ ఇవ్వబోతున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. మరో రెండు రోజుల్లో ఈ అప్‌డేట్‌ (Salaar Update) రానుందని తెలిపింది. దీంతో అభిమానుల్లో ఆనందం మొదలైంది. మరి ఇంతకి ఈ సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్ రాబోతుందనే ఇప్పుడు పెద్ద సస్పెన్స్. 

`సలార్‌` నుంచి ఇప్పటి వరకు కేవలం ఫస్ట్ లుక్‌లు తప్ప మరే అప్‌డేట్‌ రాలేదు. మధ్య మధ్యలో ఒకటి రెండు సార్లు షూటింగ్‌ లొకేషన్‌ పిక్స్ లీక్‌ అయ్యాయి. ప్రభాస్‌ మాస్‌ లుక్‌కి ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అప్‌డేట్ల కోసం దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ని రిక్వెస్ట్ చేస్తున్నారు అభిమానులు. అయినా స్పందించలేదు. ఎట్టకేలకు ఇప్పుడు రియాక్ట్ కాబోతున్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా `సలార్‌` నుంచి క్రేజీ అప్‌డేట్‌ ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు. 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ అప్‌డేట్‌ని ప్లాన్‌ చేసినట్టు తెలుస్తుంది.

మరి ఏం అప్‌డేట్‌ ఇస్తారనే చర్చ సోషల్‌ మీడియాలో ఊపందుకుంది. సినిమాని రెండు భాగాలుగా చేయబోతున్నారని, రిలీజ్‌ డేట్‌లు ప్రకటించే అవకాశం ఉందన్నారు. మరోవైపు ఫస్ట్ గ్లింప్స్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. కచ్చితంగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సినిమా రిలీజ్‌ డేట్‌ని ఇవ్వబోతున్నారనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ ఊహగానాలు ఎలా ఉన్నా ఇప్పుడు `సలార్‌` మాత్రం ట్విట్టర్‌లో మారుమోగిపోతుంది. కేవలం రెండు రోజుల్లో అప్‌డేట్‌ అనే దానితోనే ఊహించని క్రేజ్‌, హైప్‌ వస్తుండటం విశేషం. 

ఇక మైనింగ్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ప్రభాస్‌కి జోడీగా శృతి హాసన్‌ నటిస్తుంది. మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన పాత్ర నెగటివ్‌గా ఉంటుందని తెలుస్తుంది. `కేజీఎఫ్‌ `తో సంచలనాలు క్రియేట్‌ చేసిన ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. `కేజీఎఫ్‌`ని మించి ఉండబోతుందనే టాక్‌ మొదలైంది. హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాని రెండు భాగాలుగా రిలీజ్‌ చేయబోతున్నట్టు సమాచారం. 
 

click me!