`ఆర్ఆర్ఆర్` కోసం ఎదురుచూస్తున్న అభిమానులు తీవ్ర నిరాశలోకి వెళ్లారు. అయితే వాయిదాతో నిర్మాతకి వడ్డీ రేట్లు మరింతగా పెరిగే ఛాన్స్ ఉంది. ఇది మరింత భారంకాబోతుందని చెప్పొచ్చు.
`ఆర్‌ఆర్‌ఆర్` సినిమా వాయిదా టాలీవుడ్‌లో అనూహ్య పరిణామాలకు దారి తీసింది. కరోనా వైరస్ థర్డ్ వేవ్ రూపంలో విజృంభిస్తోన్న నేపథ్యంలో `ఆర్‌ఆర్‌ఆర్`ని వాయిదా వేసుకున్నారు రాజమౌళి టీమ్. నిజానికి `ఆర్‌ఆర్‌ఆర్` చిత్రం జనవరి 7న విడుదల కావాల్సి ఉంది. అందుకు తగ్గట్టుగానే నెల రోజుల ముందు నుంచే ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేసింది యూనిట్. ముంబయిలో వారం రోజులకుపైగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించారు. ఏపీలో టికెట్ల రేట్లు తగ్గడంతో ఆ లోటుని నార్త్ లో భర్తీ చేసుకోవాలని బాగా ప్రమోట్ చేశారు. నార్త్ ఆడియెన్స్ టార్గెట్‌గా ముంబయిలో నిర్వహించిన ప్రమోషన్ మంచి ఫలితాలనిచ్చిందనే చెప్పాలి.
ఇండియాలో అతిపెద్ద మార్కెట్ అయిన హిందీ మార్కెట్‌పై పట్టు సాధించారు రాజమౌళి. అనంతరం తమిళనాడు, కర్నాటక, కేరళాలో వరుసగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించారు. కొత్త ఏడాది వరకు `ఆర్‌ఆర్‌ఆర్` టీమ్.. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్‌చరణ్, అలియా భట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సినిమాపై అంచనాలను మరింతగా పెంచారు. అంతా బాగుందనుకునే టైమ్‌లో కరోనా ఒమిక్రాన్ రూపంలో విరుచుకుపడుతుండటంతో పలు రాష్ట్రాల్లో థియేటర్లు మూత పడుతున్నాయి. ఢిల్లీలో థియేటర్లు పూర్తిగా మూసేశారు. మహారాష్ట్రలో నైట్ కర్ఫ్యూ విధించారు. తమిళనాడులో సగం ఆక్యుపెన్సీతో థియేటర్లని రన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కేరళ, గోవా, కర్నాటకలోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. దీంతో అక్కడ కూడా ప్రభుత్వం థియేటర్లపై ఆంక్షలు విధిస్తుంది. మరోవైపు ఏపీలో టికెట్ల రేట్లు తక్కువగా ఉన్నాయి. కేవలం అనుకూలంగా ఉన్నది తెలంగాణ ఒక్కటే. ఇలాంటి పరిస్థితుల్లో `ఆర్‌ఆర్‌ఆర్` సినిమాని విడుదల చేస్తే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. బడ్జెట్‌లో సగం కలెక్షన్లు కూడా రావడం కష్టం. పైగా థియేటర్ కారణంగా కరోనా సోకితే అది మరింత ముప్పుగా మారే ఛాన్స్ ఉంది. దీంతో మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో `ఆర్‌ఆర్‌ఆర్`ని నాల్గోసారి వాయిదా వేస్తున్నట్టు యూనిట్ తెలిపింది.
కరోనా కంట్రోల్‌లోకి వచ్చి, పరిస్థితులు చక్కపడ్డాకే విడుదల చేస్తామని తెలిపింది యూనిట్. దీంతో `ఆర్‌ఆర్‌ఆర్` కోసం ఎదురుచూస్తున్న అభిమానులు తీవ్ర నిరాశలోకి వెళ్లారు. అయితే వాయిదాతో నిర్మాతకి వడ్డీ రేట్లు మరింతగా పెరిగే ఛాన్స్ ఉంది. ఇది మరింత భారంకాబోతుందని చెప్పొచ్చు. దీనికితోడు ఇప్పుడు మరో కొత్త నష్టం వాటిళ్లింది. ప్రమోషన్ కోసం చేసిన ఖర్చంతా బూడిదలో పోసిన పన్నీరులా మారింది. ముంబయి, చెన్నై, బెంగుళూరు, కేరళాలో `ఆర్‌ఆర్‌ఆర్` టీమ్ నిర్వహించిన ప్రమోషన్ కార్యక్రమాలకుగానూ అయిన ఖర్చు మొత్తం వృధా అయిపోయింది.
దీనికితోడు ప్రమోషన్ ఈవెంట్ల కోసం అభిమానులను తరలించడం, వారికి వసతులు కల్పించే విషయం వంటి వాటితోపాటు హీరోలకు లగ్జరీ హోటళ్లు, ఫుడ్ ఇలా ప్రతిదీ భారీగానే ఖర్చు అయ్యిందని, ఇదంతా దాదాపు ఇరవై కోట్ల వరకు ఖర్చు అయి ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పుడు `ఆర్ఆర్‌ఆర్` ఏకంగా ఇరవై కోట్లు నష్టపోవాల్సి వచ్చిందని అంటున్నారు క్రిటిక్స్. దీంతో నిర్మాత దానయ్య మరింత డిజప్పాయింట్‌కి గురవుతున్నాడని టాక్. ఇప్పుడది మోయలేని భారంగా మారిందట. మొత్తానికి `ఆర్‌ఆర్‌ఆర్`కి కష్టాలు వెంటాడుతున్నాయని చెప్పొచ్చు. మరి ఇంతకి సినిమా ఎప్పటికీ థియేటర్‌కి వస్తుందో అనేది పెద్ద సస్పెన్స్ గా మారింది.