
ఆర్ ఆర్ ఆర్ మూవీ సంచలనాలు కొనసాగుతున్నాయి. లాస్ ఏంజెల్స్ లో గల ప్రఖ్యాత 'ది థియేటర్ యట్ ఏస్ హోటల్' లో నేడు ప్రదర్శిస్తున్నారు. 1647 సీటింగ్ కెపాసిటీ గల ఈ థియేటర్ టికెట్స్ మొత్తం అమ్ముడయ్యాయి. స్క్రీనింగ్ అనంతరం రాజమౌళి, కీరవాణి, రామ్ చరణ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లో పాల్గొననున్నారు. ఈ మేరకు మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. మార్చి 1వ తేదీ సాయంత్రం 7:30 నిమిషాలకు ఆర్ ఆర్ ఆర్ స్క్రీనింగ్ జరగనుంది.
ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ మూవీ టీమ్ అమెరికాలో ఉన్నారు. ఇటీవల జరిగిన హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ ఈవెంట్లో దర్శకుడు రాజమౌళితో పాటు కీరవాణి, సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్, కొడుకు కార్తికేయ పాల్గొన్నారు. ఇక రామ్ చరణ్ HCA అవార్డ్స్ వేడుకకు స్పెషల్ గెస్ట్స్ లో ఒకరిగా హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా ఒక అవార్డు ప్రదానం చేయడం జరిగింది. అలాగే ఆయన్ని స్పాట్ లైట్ అవార్డుతో సత్కరించారు.
ఐతే ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ టీమ్ తో పాటు అమెరిక వెళ్ళలేదు. ఫిబ్రవరి 18న అన్నయ్య తారకరత్న కన్నుమూశారు.దీంతో కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. వేదనలో ఉన్న ఎన్టీఆర్ వేడుకలకు దూరంగా ఉన్నారు. అలాగే తారకరత్న మరణాంతర కార్యక్రమాలు ఇంకా పూర్తి కాలేదు. మార్చి 2న తారకరత్న పెదకర్మ జరగనుంది. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం ఎన్టీఆర్ అమెరికా బయలుదేరనున్నారు. మార్చి 6న ఆయన అమెరికా వెళుతున్నట్లు సమాచారం అందుతుంది.
ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు ఆస్కార్ నామినేషన్స్ లో నిలిచిన విషయం తెలిసిందే. మార్చి 12న లాస్ ఏంజెల్స్ వేదికగా జరగనున్న ఆస్కార్ వేడుకలో ఆర్ ఆర్ ఆర్ టీమ్ పాల్గొననున్నారు. ఆ రోజు రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవల నాటు నాటు లైవ్ ఫర్ఫార్మన్స్ హైలెట్ కానుంది. నాటు నాటు సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న నేపథ్యంలో ఆస్కార్ వరిస్తుందని టీమ్ గట్టి విశ్వాసంతో ఉన్నారు.
కీరవాణి ఈ సాంగ్ స్వరపరచగా... రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ పాడారు. లిరిసిస్ట్ చంద్రబోస్ సాహిత్యం అందించారు. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ అందించారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ అదిరిపోయే స్టెప్స్ తో పాటకు విపరీతమైన ఆదరణ తీసుకొచ్చారు. ఇక మరికొన్ని రోజుల్లో ఆస్కార్ వేదికపై ఆర్ ఆర్ ఆర్ భవితవ్యం తేలనుంది. నాటు నాటు ఆస్కార్ గెలుచుకుంటే... అదో అరుదైన ఘటనగా ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో నిలిచిపోతుంది.