
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన భారీ చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’. ఈ మల్టీ స్టారర్ చిత్రం గత నెల 25న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. భారీ బడ్జెట్ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటించారు. ఇద్దరు ఉద్యమ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీం పాత్రల్లో రామ్ చరణ్, ఎన్టీఆర్ జీవించేశారు. వీరిద్దరూ అన్నదమ్ముల్లా నటించడంతో ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతోంది.
అయితే ఆర్ఆర్ఆర్ కు పైరసీ నుంచి పెద్ద షాకే ఎదురైందని చెప్పాలి. ఈ పాన్ ఇండియా చిత్రం రిలీజ్ అయ్యి ఇంకా రెండు వారాలు కూడా పూర్తి కాకుండానే అటు ఇంటర్నెట్ లోకి.. ఇటు యూట్యూబ్ లోనూ లీకైంది. అయితే ఇంటర్నెట్ లోని లీక్ ల అంశం కన్నా.. ఏకంగా యూట్యూబ్ లో ఆర్ఆర్ఆర్ ఫుల్ హెచ్ డీ లీక్ అవడం పట్ల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ ఛానెల్ లో లీక్ అయ్యిందో తెలియజేస్తూ ట్విట్టర్ లో స్క్రీన్ షాట్ ఫొటోలను పోస్ట్ చేస్తూ ఆర్ఆర్ఆర్ మేకర్స్ కు సూచిస్తున్నారు. ఇప్పటికైనా ఈ లీక్ ల పర్వాన్ని ఆపాలని కోరుతున్నారు.
మరోవైపు సినిమా రిలీజ్ అయిన రెండు, మూడు రోజుల్లోనే ఆర్ఆర్ఆర్ మూవీలోని హైలేట్ సీన్స్ అన్నీ వీడియోక్లిప్ ల రూపంలో యూట్యూబ్ లోకి వచ్చి చేరాయి. ఇంకా కొన్ని ఛానెళ్లలో ఆర్ఆర్ఆర్ ఫైట్ సీన్స్ వీడియోలు ఉండటం పట్ల అభిమానులు కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు.వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. గతంలోనూ జక్కన్న దర్శకత్వం వహించిన ‘బహుబలి’ (Bahubali : The Beginning) చిత్రంలోని క్లైమాక్స్ సీన్ లీక్ అయిన విషయం తెలిసిందే.
అయితే, ఆర్ఆర్ఆర్ మూవీ లీక్ పట్ల కొందరు సినీ ప్రియుకులు ఏప్రిల్ 14న రిలీజ్ కానున్న భారీ బడ్జెట్ కన్నడ ఫిల్మ్ KGF Chapter 2 మేకర్స్ కు పలు సూచనలు చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ లాగా కేజీఎఫ్ లోని ముఖ్యమైన సీన్లు లీక్ కాకుండా జాగ్రత్తపడాలని సూచిస్తున్నారు. ఇప్పటి నుంచే లీక్ లకు చెక్ పెట్టేలా ఏదైనా గట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే రామ్ చరణ్ నటిస్తున్న ఆర్సీ 15 RC 15 నుంచి లీక్ పర్వం కొనసాగుతుండగా.. దర్శకుడు ఎస్ శంకర్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఏ చిన్న ఫొటోను లీక్ చేసినా చర్యలు తీసుకుంటామని, అందుకోసం ప్రత్యేకమైన టీం పనిచేస్తోందని చెప్పడం పట్ల అక్రమార్కులు కొంత వెనుకడుగు వేసినట్టు తెలుస్తోంది. ఇక ఆర్ఆర్ఆర్ లీక్ లపై ఇప్పటికైతే మేకర్స్ అంతర్గతంగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.