
పవన్ కల్యాణ్ మాజీ సతీమణి రేణూ దేశాయ్ ‘నీతోనే డ్యాన్స్ షో’ కార్యక్రమంలో న్యాయనిర్ణేతగా పాల్గొంటోందని తెలిసిందే. ఈ షోలో రేణూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారం కానున్న ఈ షోకి సంబంధించిన లేటెస్ట్ ప్రొమోను 'స్టార్ మా' తమ ట్విట్టర్ ఖాతాలో ఉంచింది. ఈ ప్రోమోలో ఓ జంట చేసిన డ్యాన్స్‌పై ప్రశంసల వర్షం కురిపించిన రేణూ దేశాయ్.. ఆ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు కంటతడి పెట్టిస్తున్నాయి.
‘నాకు ప్రేమ మీద కొంచెం నమ్మకం పోయింది.. కానీ మీ అనుబంధం చూసిన తర్వాత ఇప్పుడు మరోసారి నేను ప్రేమతో ప్రేమలో పడ్డాను.. నేను ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటానో అప్పుడు మిమ్మల్ని తప్పకుండా ఆహ్వానిస్తా’ అని రేణూ కన్నీరు పెట్టుకుంటూ ఆ జంటను అభినందించారు. పవన్‌తో విడిపోయి, బయట ప్రపంచానికి దూరంగా ఉన్న ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్ ఇటీవలే నీతోనే డ్యాన్స్ ప్రోగ్రామ్‌తో ముందుకు వచ్చారు.
పవన్ నుంచి విడిపోయిన తర్వాత జరిగిన ఒక్కో సంఘటనను ఆమె అభిమానులతో పంచుకుంటున్నారు. కొంతకాలం క్రితం తాను తీవ్రమైన జ్వరం, 'ఆర్థో ఇమ్యూన్ కండిషన్' బారిన పడినప్పుడు కోలుకోవడానికి చాలాకాలం పట్టిందని, అదే సమయంలో గుండెలో సమస్యతో, ఇంటికీ, ఆసుపత్రికీ తిరుగుతూ ఇబ్బందులు పడిన విషయాన్ని ఆమె గుర్తుచేసుకున్నారు. ఆ సందర్భంలోనే ఎవరన్నా తోడుంటే బాగుంటుందని ఫీలయ్యానని రేణు తెలిపింది.