
డాన్‌శీను, బలుపు వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్ తర్వాత మాస్ మహారాజా రవితేజ, గోపిచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందిన హ్యాట్రిక్ చిత్రం `క్రాక్`. శృతిహాసన్ హీరోయిన్‌గా నటించగా సముద్రఖని, వరలక్ష్మిశరత్‌కుమార్ కీలక పాత్రలలో నటించారు. సరస్వతి ఫిలిం డివిజన్ పతాకంపై బి. మధు నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్‌లలో విడుదలై బ్లాక్ బస్టర్ టాక్‌తో మంచి కలెక్షన్లు సాధిస్తోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం సీక్వెల్ చేస్తే బాగుంటుందని భావిస్తున్నారు. దర్సకుడు సైతం ఇదే ఆలోచనలో ఉన్నట్లు తెలియచేసారు.
డైరక్టర్ గోపిచంద్ మలినేని మాట్లాడుతూ...‘‘సొంత కథ చేసుకుంటే ఆ కిక్కే వేరు. ‘క్రాక్’తో అది మరోసారి తెలిసొచ్చింది. దీనికి కొనసాగింపుగా ‘క్రాక్2’ తీస్తా. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో ఆ సినిమాని చేయబోతున్నా. మరో వారం రోజుల్లో పూర్తి వివరాలు చెబుతా.’’ అన్నారు.
అలాగే ‘‘తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాకోసం ఎదురు చూశారు. సరైన సమయానికి సరైన సినిమాగా ‘క్రాక్’ వచ్చింది. ఈ చిత్రంతో ఇప్పటిదాకా ఉన్న గందరగోళాలన్నీ ఒక్కసారిగా తొలగిపోయి... పరిశ్రమకి మళ్లీ ఊపొచ్చింది’’ అన్నారు గోపీచంద్ మలినేని.
హిందీ రీమేక్ గురించి మాట్లాడుతూ... ఈ సినిమాను హిందీలో రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రీమేక్ కు దర్శకత్వం వహించే అవకాశం వస్తే తప్పకుండా ఆ బాధ్యతల్ని స్వీకరిస్తా. బాలీవుడ్‌లో సరైన హీరో.. నిర్మాత.. దొరికితే ఖచ్చితంగా నేనే చేస్తా. రణ్‌వీర్‌సింగ్, అక్షయ్‌కుమార్, అజయ్ దేవ్‌గన్ బాగా సెట్ అవుతారు.
క్రాక్ విజయం దర్శకుడిగా నా బాధ్యతను మరింత పెంచింది. నేను కథలు రాసుకునే విధానంలో ఈ సినిమా మార్చు తీసుకొచ్చింది. ఈ సినిమా సక్సెస్ విషయంలో నేను 200 పర్సెంట్ హ్యాపీ. నా తదుపరి సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ లో చేయబోతున్నా, లాక్ డౌన్ సమయంలోకథ రాసుకున్నా, విభిన్నమైన అంశాలతో ఈ సినిమా సాగుతుంది అన్నారు.