
రీసెంట్ గా రిలీజైన ఖిలాడీతో రవితేజ పూర్తిగా నిరాశపరిచాడు. దాంతో ఇప్పుడు రామారావ్ ..అన్ డ్యూటీ అంటూ అంతే వేగంగా గోడకు కొట్టిన బంతిలా దూసుకు రాబోతున్నాడు. ప్రభుత్వ డిప్యూటీ కలెక్టర్ గా రవితేజ నటించిన రామారావ్ ఆన్ డ్యూటీ సినిమా రెడీ అయిపోతోంది. దాదాపు పూర్తి కావచ్చింది. ఈ నేపధ్యంలో ప్రమోషన్స్ షురూ చేసారు.
సినిమాప్రీ పబ్లిసిటీలో భాగంగా మహా శివరాత్రి సందర్భంగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేసారు. ఈ టీజర్ నిడివి కాస్త ఎక్కువే వుంది. కచ్చితంగా ఫ్యాన్స్ ను అలరించేదిగానే వుంది. అయితే ఈ సారి ఓ వివాదాస్పద విషయాన్ని తీసుకుని రామారావు డ్యూటీ ఎక్కాడంటున్నారు. ఈ సినిమాలో ఆంధ్రాలో గత కొంతకాలంగా వివాదాస్పదంగా మారిన ఇసుక మాఫియా చుట్టు కథ నడుస్తోందని సమాచారం. వాస్తవంగా జరిగిన కొన్ని సంఘటనలు బేస్ చేసుకుని ఈ కథ చేసారంటున్నారు. సినిమా రిలీజ్ అయ్యాక పెద్ద చర్చ జరుగుతుందని చెప్పుకుంటున్నారు. ఈ విషయమై ఇప్పటికే సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
'రామారావు ఆన్ డ్యూటీ'లో రవితేజ ప్రభుత్వ ఉద్యోగి పాత్రలో కనిపిస్తున్నారు. ఆయనది డిప్యూటీ కలెక్టర్ రోల్ అని అర్థం అవుతోంది. ఇసుక మాఫియాను డిప్యూటీ కలెక్టర్ టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ఇంకా ఇతర సమస్యల మీద కూడా రామారావు పాత్ర పోరాటం చేస్తుందని తెలిసింది.
"ఆయుధం మీద ఆధారపడిన నీలాంటి వాడి ధైర్యం... వాడి ఆయుధంలో ఉంటుంది. ఆయుధంలా బ్రతికే నాలాంటి వాడి ధైర్యం... అణువణువునా ఉంటుంది" అని మాస్ మహారాజ రవితేజ అంటున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న సినిమా 'రామారావు ఆన్ డ్యూటీ'. అందులోని డైలాగ్ ఇది. ఇక, "నేరస్థులకు తప్పకుండా శిక్ష పడుతుంది. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోయినా సరే" అని చెప్పే డైలాగ్ హీరో క్యారెక్టరైజేషన్ చెబుతోంది.
రవితేజ యాక్షన్ థ్రిల్లర్ `రామారావు ఆన్ డ్యూటీ` ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తి కాగా రెండు పాటల చిత్రీకరణ పెండింగ్లో ఉంది. సుధాకర్ చెరుకూరి నిర్మాత. నూతన దర్శకుడు శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్నారు. రవితేజ తో పాటు హీరోయిన్లు దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్, మిగతా పాత్రధారులు తనికెళ్ల భరణి, వీకే నరేష్, రాహుల్ రామకృష్ణ, వేణు తొట్టెంపూడి తదితరులను కూడా టీజర్ లో చూపించారు.