
ధనుష్, రష్మిక మందన్న తొలిసారి కలిసి నటించిన చిత్రం ‘కుబేరా’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ధనుష్, రష్మిక మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. కుబేర చిత్రం రిలీజ్ అయ్యాక రష్మిక తొలిసారి సోషల్ మీడియా వేదికగా ధనుష్‌ను ఉద్దేశించి ఒక ప్రత్యేకమైన పోస్ట్ చేసింది.
రష్మిక తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో ధనుష్‌తో తీసుకున్న ఏకైక సెల్ఫీని షేర్ చేస్తూ, "ఒకే సినిమా చేశాం కానీ, ఇదే నాకు మిగిలిన ఏకైక ఫోటో" అని పేర్కొన్నారు. ఆమె రాసిన పోస్ట్‌లో, "కుబేర చిత్రం మొత్తం జర్నీలో మీతో తీసుకున్న ఏకైక సెల్ఫీ ఇదే. ఈ పోస్ట్ మీ కోసం. మీరు నిజంగా ఓ మాణిక్యం లాంటి వ్యక్తి. ప్రతి రోజు అద్భుతంగా కష్టపడుతున్నారు. విశ్రాంతి అవసరం గురించి మాట్లాడినా, అది తీసుకునే సమయం మాత్రం ఎప్పుడూ ఉండదు. కుబేరా మాత్రమే కాకుండా, మీ ప్రతీ చిత్రంలో మీరు చూపిన నటన అద్భుతం. చిత్ర షూటింగ్ సమయంలో మీరు నాకు ఇచ్చిన లడ్డూలని కూడా మరచిపోలేను. అదే విధంగా తమిళం నేర్చుకోవడంలో మీరు నాకు సహాయం చేశారు. నాతో మాత్రమే కాదు మీతో ఇంటరాక్ట్ అయ్యే ప్రతి ఒక్కరితో మీరు ఎంతో మంచి హృదయంతో ఉంటారు. " అని రష్మిక పేర్కొంది.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రష్మిక ‘సమీరా’ పాత్రలో కనిపించగా, ధనుష్ ఓ బిక్షాటకుడిగా ‘దేవా’ పాత్రను పోషించారు. దేవా, సమీరా అనుకోని పరిస్థితుల్లో ఒకరికొకరు ఎదురుపడతారు. పరిచయం అవుతుంది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య వచ్చే ప్రతి సన్నివేశం ఆసక్తికరంగా ఉంటుంది. సమీరా సహాయంతో ఒక భారీ స్కామ్‌ను దేవా బయటపెట్టడం జరుగుతుంది. ఈ కథనంలో ధనుష్ నటనకు విమర్శకుల నుండి విశేష ప్రశంసలు లభించాయి.
రష్మిక పోస్ట్ కి ధనుష్ రిప్లై ఇస్తూ ధన్యవాదాలు తెలిపారు. "అద్భుతమైన పోస్ట్. మీరు మరిచిపోలేని వ్యక్తి. మీ పాజిటివ్ ఎనర్జీ అలా కొనసాగించండి. మీకు మరింత శక్తి, విజయాలు అందాలని ఆశిస్తున్నాను" అని పేర్కొన్నారు.ఈ పోస్టులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఈ సహజమైన పరస్పర గౌరవాన్ని మెచ్చుకుంటున్నారు. కుబేర చిత్రం ధనుష్ కెరీర్ లో ప్రత్యేకమైనదిగా నిలుస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు.
ఇటీవల కుబేర సక్సెస్ సెలెబ్రేషన్స్ జరిగాయి. సక్సెస్ సెలెబ్రేషన్స్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో ధనుష్ మాట్లాడుతూ భారీ యాక్షన్, విజువల్స్ ఉండే పాన్ ఇండియా చిత్రాలు మాత్రమే కాదు.. కుబేర లాంటి చిత్రంతో కూడా ప్రేక్షకులని థియేటర్స్ కి రప్పించవచ్చు అని శేఖర్ కమ్ముల నిరూపించినట్లు ప్రశంసలు కురిపించారు. హార్ట్ ఫుల్ గా సినిమా తీస్తే ఆడియన్స్ ని ధియేటర్స్ కి తీసుకురావచ్చు అనే హోప్ ని ఆయన ఇచ్చారు. ఎమోషన్ అనేది బిగ్గెస్ట్ గ్రాండియర్. హ్యూమన్ ఎమోషన్స్ కంటే పెద్ద గ్రాండియర్ ఏది ఉండదు అని ధనుష్ తెలిపారు.