
ఈ చిత్రానికి రవీంద్ర పూలే దర్శకత్వం వహించనుండగా, అన్‌ఫార్ములా ఫిల్మ్స్ సంస్థ నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. 'మైసా' చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, మలయాళం , కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇది పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న భారీ బడ్జెట్ ప్రాజెక్ట్. ఇక తాజాగా ఈసినిమా నుంచి మూవ టీమ్ టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేయగా.. అందులో రష్మిక మందన్న యోధురాలిగా కనిపించింది. ఇక ఈ పోస్టర్ లో రష్మిక గెటప్, హావభావాలు గంభీరంగా ఉన్నాయి. పోస్టర్ చూస్తుంటే ఈసినిమాలో చాలా పవర్ ఫుల్ రోల్ లో రష్మిక కనిపించబోతున్నట్టు అర్ధం అవుతోంది.
ఇక పోస్టర్‌పై ఓ క క్యాప్షన్ కూడా కనిపించింది. ‘‘ధైర్యం ఆమె బలం. సంకల్పంలో లేదు కనికరం.. ఆమె గర్జన వినడానికి కాదు.. భయపెట్టడానికి’’ అనే వాక్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ డైలాగ్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. ఇక ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ, ‘‘నేను ఎప్పుడూ కొత్తదనం, వైవిధ్యం ఉన్న కథలకే ప్రాధాన్యత ఇస్తాను. ‘మైసా’ అలాంటి సినిమానే. ఇది నేను ఇంతకు ముందెన్నడూ చేయని పాత్ర, అడుగుపెట్టని ప్రపంచం. ఈ సినిమాను మీ ముందుకు తీసుకురావడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఇది ఆరంభం మాత్రమే’’ అని తెలిపారు.
ఇటీవల ‘కుబేర’సినిమా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విజయం తర్వాత రష్మిక సినిమాలపై అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం ఆమె పలుప్రాజెక్ట్ లలో బిజీగా ఉన్నారు. ఆమె నటిస్తున్న సినిమాల్లో ముఖ్యంగా రెండు చిత్రాలు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి. ది గర్ల్‌ఫ్రెండ్ – రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం లేడీ ఓరియెంటెడ్ కథతో రూపొందుతోంది. ఇందులో రష్మిక ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.
ఆ సినిమాతో పాటు థామా మూవీలో కూడా ఆమె నటిస్తోంది. బాలీవుడ్ యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానాతో కలిసి నటిస్తున్న ఈ చిత్రం, అతీంద్రియ శక్తులతో కూడిన ఒక రొమాంటిక్ కథ ఆధారంగా తెరకెక్కుతోంది. ఇక ప్రస్తుతం ‘మైసా’ ప్రకటనతో రష్మిక ఖాతాలో మరో భారీ చిత్రం చేరింది. ‘మైసా’లో ఆమె యోధురాలగా కనిపించనుండటం, ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా నిలబెడుతోంది. రష్మిక సినీ జీవితంలో ఇదొక సరికొత్త ప్రయోగం కావడం విశేషం.
ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడించనున్నారు. కాగా, టైటిల్ పోస్టర్ ద్వారా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రష్మిక యాక్షన్ పాత్రలో ఎలా మెప్పించనుందో చూసేందుకు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.‘మైసా’ సినిమా రిలీజ్ తేదీతో పాటు ఈసినిమాలో నటించేవారి వివరాలను త్వరలో తెలియజేయనున్నట్టు మూవీ టీమ్ ప్రకటించింది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న ఈ సినిమాతో రష్మిక మందన్న డిమాండ్ మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది.