Ranveer Singh: బాలీవుడ్‌లో రణ్‌వీర్‌పై బ్యాన్! ఇక సినిమాలు చేయలేడా? కెరీర్‌ సంగతేంటి?

Published : May 28, 2026, 01:23 PM IST
Ranveer Singh Faces FWICE Ban

సారాంశం

నిర్మాణ సంస్థకు భారీ ఆర్థిక నష్టం కలిగించాడనే ఆరోపణలతో రణ్‌వీర్ సింగ్‌పై సినీ కార్మిక సంఘం నిషేధం విధించింది. ఈ వివాదం వల్ల రణ్‌వీర్ కెరీర్‌కు ఎలాంటి నష్టం వాటిల్లుతుంది, అసలు ఈ నిషేధం ఎంతవరకు చెల్లుబాటు అవుతుందనే దానిపై ఇప్పుడు బాలీవుడ్‌లో పెద్ద చర్చే నడుస్తోంది.

బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ ఇప్పుడు ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ముఖ్యంగా 'ధురంధర్', 'ధురంధర్: ది రివెంజ్' లాంటి సినిమాల సక్సెస్ తర్వాత ఆయన క్రేజ్ అమాంతం పెరిగింది. కానీ, ఇంతటి విజయం మధ్యలోనే రణ్‌వీర్ ఒక పెద్ద వివాదంలో చిక్కుకున్నాడు. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో రాబోతున్న 'డాన్ 3' సినిమాకు మొదట ఓకే చెప్పి, ఆ తర్వాత హఠాత్తుగా ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడని ఆరోపణలు వస్తున్నాయి. ఈ కారణంగానే 'ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్' (FWICE) ఆయనపై నిషేధం విధించినట్లు వార్తలు గుప్పుమన్నాయి.

అసలు ఈ FWICE ఏంటి?

ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) అనేది భారత సినిమా, టెలివిజన్ రంగంలోని కార్మికుల అతిపెద్ద సంఘాలలో ఒకటి. 1958లో ముంబై కేంద్రంగా దీన్ని స్థాపించారు. ఈ సంస్థలో సుమారు ఐదు లక్షల మందికి పైగా కార్మికులు, టెక్నీషియన్లు సభ్యులుగా ఉన్నారు. మన దగ్గర మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ఎలాగో, అక్కడ ఇది కార్మికుల కోసం పనిచేసే అతిపెద్ద సంఘం.

ఈ సంఘంలోని సభ్యులలో వీళ్లు ఉంటారు:

  • స్పాట్‌బాయ్స్, లైట్‌మెన్
  • మేకప్ ఆర్టిస్టులు
  • స్టంట్ పెర్ఫార్మర్లు
  • డ్యాన్సర్లు
  • ఎడిటర్లు
  • అసిస్టెంట్ డైరెక్టర్లు
  • సినిమాటోగ్రాఫర్లు
  • కాస్ట్యూమ్ డిజైనర్లు
  • జూనియర్ ఆర్టిస్టులు, ఇంకా ఎంతోమంది సాంకేతిక నిపుణులు.

ప్రధానంగా కార్మికుల హక్కులను కాపాడటం, జీతభత్యాల సమస్యలను పరిష్కరించడం, పని ప్రదేశంలో భద్రత కల్పించడం ఈ సంస్థ ముఖ్య ఉద్దేశాలు.

రణ్‌వీర్‌పై  నిషేధంఎందుకు ?

బాలీవుడ్ నుంచి  వస్తున్న వార్తల ప్రకారం, 2023లో 'డాన్ 3' సినిమాలో రణ్‌వీర్ హీరోగా నటిస్తాడని ప్రకటించారు. కానీ, షూటింగ్ మొదలవకముందే ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. అయితే, అప్పటికే నిర్మాణ సంస్థ 'ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్' దాదాపు రూ.45 కోట్లు ఖర్చు చేసిందని ఆరోపణ. దీంతో ఆ నిర్మాణ సంస్థ FWICEను ఆశ్రయించింది. సమస్య పరిష్కారానికి రణ్‌వీర్ ఏమాత్రం సహకరించలేదని వాళ్లు ఫిర్యాదు చేశారు. అందుకే, రణ్‌వీర్‌తో ఎవరూ పనిచేయవద్దని FWICE ఇండస్ట్రీని కోరినట్లు తెలుస్తోంది.

ఈ బ్యాన్' నిజంగా అమలవుతుందా? 

ఈ నిషేధం వల్ల రణ్‌వీర్ కెరీర్ నిజంగానే ఆగిపోతుందా? అనే ప్రశ్న తలెత్తుతోంది. వాస్తవానికి, విషయం అంత సులభం కాదు. ఎందుకంటే FWICE ప్రభుత్వ సంస్థ కాదు. కాబట్టి చట్టపరంగా రణ్‌వీర్‌పై ఎలాంటి నిషేధం విధించలేదు. ఆయన కావాలనుకుంటే సినిమాలు చేసుకోవచ్చు.

కానీ, అసలు సమస్య వేరే చోట ఉంది. బాలీవుడ్‌లో ఒక సినిమా తీయాలంటే వేలాది మంది టెక్నీషియన్లు, కార్మికులు అవసరం. ఒకవేళ FWICE సభ్యులు రణ్‌వీర్ సినిమాలో పనిచేయడానికి నిరాకరిస్తే, షూటింగ్ ఆగిపోయే ప్రమాదం ఉంది. భవిష్యత్తులో ఆయన సినిమాల నిర్మాణం ఆలస్యం కావొచ్చు.

మరోవైపు, బాలీవుడ్‌లోని చాలామంది ప్రముఖ నటులు నేరుగా FWICEలో సభ్యులు కాదు. వాళ్లు 'సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్' (Cine and TV Artists Association)తో అనుబంధం కలిగి ఉంటారు. కాబట్టి కేవలం FWICE నిర్ణయంతో ఒక నటుడి కెరీర్ పూర్తిగా ఆగిపోదు.

చాముండేశ్వరి ఆలయంలో పూజలు

ఈ వివాదం నడుస్తుండగానే, మంగళవారం రణ్‌వీర్ కర్ణాటకలోని చాముండేశ్వరి ఆలయంలో పూజలు చేస్తూ కనిపించాడు. ఇటీవల కర్ణాటక దేవతలను అవమానించారనే ఆరోపణల నుంచి ఆయనకు విముక్తి లభించింది. అందుకే ఆలయంలో పూజలు చేశారని చాలామంది భావిస్తున్నారు.

అయితే, ఎయిర్‌పోర్ట్‌లో ఈ 'నిషేధం' గురించి మీడియా అడిగిన ప్రశ్నలకు రణ్‌వీర్ స్పందించలేదు. వృత్తిపరమైన చర్చలు పరస్పర గౌరవంతో జరగాలని ఆయన భావిస్తున్నందునే మౌనంగా ఉన్నారని తర్వాత ఆయన ప్రతినిధి తెలిపారు.

ఈ వివాదంపై నెటిజన్లు రెండుగా విడిపోయారు. రణ్‌వీర్ ఇటీవలి విజయాలను చూసి ఓర్వలేకే ఆయనపై ఇలా ఒత్తిడి తెస్తున్నారని కొందరు అభిమానులు వాదిస్తున్నారు. మరోవైపు, ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఒక నటుడు హఠాత్తుగా సినిమా నుంచి తప్పుకుంటే నిర్మాతలకు భారీ నష్టం వస్తుందని, కాబట్టి నష్టపరిహారం అడగటంలో తప్పులేదని విమర్శకులు అంటున్నారు. ఇప్పుడు రణ్‌వీర్, నిర్మాణ సంస్థ మధ్య రాజీ కుదురుతుందా లేదా అనే దానిపైనే ఈ 'నిషేధం' వివాదం భవిష్యత్తు ఆధారపడి ఉంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Raghavendra Rao: ఈ వయసులో ఇవేం పనులు, దర్శకేంద్రుడిపై మండిపడుతున్న నెటిజన్లు
Nagabandham Trailer Review: అనంత పద్మనాభస్వామి ఆలయ రహస్యాలు, నాగబంధం ట్రైలర్ రివ్యూ..