
ఈనాడు గ్రూప్ చైర్మన్ రామోజీరావు తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 87 ఏళ్లు. రామోజీరావు మరణంతో టాలీవుడ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి. ప్రముఖులు, అభిమానులు సంతానం తెలియజేస్తున్నారు. రామోజీ భౌతికకాయాన్ని సందర్శించిన దర్శకుడు రాజమౌళి మీడియాతో మాట్లాడారు. ఆయన ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. రామోజీరావు మీడియా, సినిమా రంగానికి చేసిన సేవలకు గాను భారతరత్న ఇవ్వడమే సముచిత గౌరవం అన్నారు.
రాజమౌళి మాట్లాడుతూ... ఒక మనిషి అన్ని రంగాలలో రాణించడం గొప్ప విషయం. రామోజీరావు అనేక ఇన్స్టిట్యూషన్స్ స్థాపించి, కేవలం స్థాపించడమే కాకుండా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. ఏ రంగంలో అడుగుపెట్టిన దాన్ని శిఖరాలకు తీసుకెళ్లిన వ్యక్తి. ఆయన ఎంతో మందికి మార్గదర్శకంగా నిలిచారు. ఎంతో మందికి ఉపాధి కల్పించారు. అలాంటి వ్యక్తికి భారతరత్న ఇవ్వడమే నిజమైన నివాళి, అన్నారు.
రామోజీరావు గురించి మాట్లాడుతూ రాజమౌళి చాలా ఎమోషనల్ అయ్యారు. కీరవాణి, రాజమౌళి, విజయేంద్రప్రసాద్ తో పాటు వీరి కుటుంబ సభ్యులు రామోజీరావుతో ప్రత్యేక అనుబంధం కలిగి ఉన్నారు. రామోజీ పార్థీవ దేహాన్ని చూసి రాజమౌళి కన్నీరు పెట్టుకున్నారు. రామోజీరావు గొప్ప ప్రస్థానం సాగించారు. మొదట రామోజీరావు ఈనాడు పత్రిక స్థాపించారు. అనంతరం చిత్ర నిర్మాణ సంస్థ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, మార్గదర్శి చిట్ ఫండ్స్ వంటి సంస్థలను ఏర్పాటు చేశారు. దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమకు సేవలు అందిస్తున్నారు.