
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించనున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం.. విడుదలకు ముందే సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తోంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపై వర్మ సోషల్ మీడియాలో స్పందిస్తున్న తీరుకు నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఇక తాజాగా ఏపీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి వర్మ తన ఫేస్ బుక్ ఎకౌంట్ లో వేసిన సెటైర్ మరోసారి సంచలనంగా మారింది.
ముఖ్యంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో చంద్రబాబు నాయుడు పాత్రను ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తి పోషిస్తున్నాడనే వార్త ఫిలిం వర్గాల్లో చర్చనీయాంశమైంది. చంద్రబాబు పాత్ర ఎలా ఉండబోతుందనే విషయంపై మరింత ఆసక్తిని రేకెత్తించింది. అయితే ఈ చర్చ మరోస్థాయికి చేరుతున్న నేపథ్యంలో దీనిపై తప్పనిసరి పరిస్థితుల్లో వర్మ ఫేస్‌బుక్‌లో స్పందించాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో ఎవరు నటిస్తున్నారనే విషయంపై ఇంకా నాకే క్లారిటీ లేదు. అయితే చంద్రబాబు నాయుడు పాత్రలో జేడీ నటించడు అనే స్పష్టతను మాత్రం ఇస్తున్నా. అంటూ వర్మ క్లారిటీ ఇవ్వడం గమనార్హం.
ఇక ఇదే పోస్టులో వర్మ నాడు చంద్రబాబునాయుడు సీఎం కావటానికి వైస్రాయ్ హోటల్ లో జరిగిన తతంగాన్ని ఉటంకిస్తూ... వర్మ వైస్రాయి ఘటనలో చంద్రబాబు పాత్రపై కూడా తనదైన శైలిలో స్పందించాడు. ఎన్టీఆర్‌ను అధికారం నుంచి తప్పించే క్రమంలో వైస్రాయి హోటల్‌లో చంద్రబాబు ఏమి చేశాడో.. ఎలాంటి పాత్రను పోషించాడో నాకు క్లారిటీ లేదు అని వర్మ పేర్కొన్నాడు.
లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి సంబంధించిన వ్యవహారం చూస్తే... సినిమా ప్రారంభం కాకముందే అనేక వివాదాలు ఈ చిత్రాన్ని వెంటాడటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు నాగార్జున సినిమా తర్వాత గానీ వర్మ ఈ సినిమా పని మొదలు పెట్టే అవకాశం లేకున్నా... దీనిపై సోషల్ మీడియోలోనే కాక.. ఆడా ఈడా బాగానే రచ్చ జరుగుతోంది. రాజకీయ వర్గాల్లో కూడా ఇటు అధికారపక్షం, అటు ప్రతిపక్షం రెండూ వర్మ సినిమాపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి తనకేమీ తెలియదంటున్న వర్మ.. సినిమాలో ఏం చూపిస్తాడోనని జనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.