
పెళ్లిచూపులు సక్సెస్ తో మాంచి క్రేజీ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం “అర్జున్ రెడ్డి”. తాజాగా ఈ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ చేసిన కమెంట్స్ పై నెటిజన్లే కాక తెలుగు సొసైటీ నుండి భిన్నాభిప్రాయాలు వెలువడ్డాయి. అయితే అర్జున్ రెడ్డి సినిమాకు సంబంధించి ఇప్పుడు రాజకీయ నేతలు కూడా స్పందించడంతో... ఆ సినిమాతో సంబంధం లేకున్నా... వివాదాలకు నెలవు, సంచలనాలకు మారుపేరు రామ్ గోపాల్ వర్మ తెగ రియాక్ట్ అవుతున్నాడు. మొత్తానికి అర్జున్ రెడ్డి సినిమా విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరుగుతుండటం హాట్ టాపిక్ అయింది.
వీరి మధ్య చిన్నగా మొదలైన ఈ వివాదం మరింత ముదురుతోంది. 'అర్జున్ రెడ్డి' పోస్టర్లను కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు చించేసిన నేపథ్యంలో ఆయనపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మండి పడ్డారు. ఆ సినిమా హీరో విజయ్ వెళ్లి విహెచ్ దుస్తులు చించేయాలంటూ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే.
వర్మ కామెంట్లపై వి. హనుమంతరావు స్పందిస్తూ.... ముంబై లో ఉండి ఏదిపడితే అది మాట్లాడటం కాదు, ఈ సారి హైదరాబాద్ లో ఎలా అడుగు పెడతావో చూస్తా అంటూ రామ్ గోపాల్ వర్మకు వీహెచ్ వార్నింగ్ ఇచ్చారు.
వీహెచ్ కామెంట్లపై వర్మ రిప్లై తెగ ఇంట్రెస్టింగ్ గా మారింది. ‘సార్... మీరు నన్ను హైదరాబాద్ లో అడుగుపెట్టనివ్వరా? ప్రస్తుతం నేను హైదరాబాద్‌లోనే ఉన్నా' అంటూ కౌంటర్ వేశారు.
‘వీహెచ్ సార్... నేను రేపు ఉదయం 10.30 గంటలకు ప్రసాద్ ఐమ్యాక్స్ లో అర్జున్ రెడ్డి మార్నింగ్ షో చూసేందుకు వస్తున్నా... అక్కడ చూసుకుందాం.. బస్తీ మే సవాల్' అంటూ రామ్ గోపాల్ వర్మ ఛాలెంజ్ విసిరాడు.
హనుమంతరావుగారు హైదరాబాద్‌లో నన్ను అడుగు పెట్టనీయడం కన్నా, మీకు దమ్ముంటే మీ మనవళ్ల వయసున్న అబ్బాయిలను, అమ్మాయిలను ‘అర్జున్ రెడ్డి' సినిమా థియేటర్లలోకి అడుగు పెట్టకుండా ఆపండి అంటూ సవాల్ చేశారు.