సంచలనాత్మక చిత్రాన్ని ప్రకటించిన రామ్‌గోపాల్ వర్మ.. తెలంగాణ రక్తచరిత్ర

By Aithagoni RajuFirst Published Sep 24, 2021, 7:59 PM IST
Highlights

దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ(rgv) తాజాగా ఓ సంచలన సినిమా(movie)ని ప్రకటించారు. మాజీ మంత్రి కొండా సురేఖ(konda murali), కొండా మురళీ(konda surekha) దంపతుల జీవితాల ఆధారంగా తెలంగాణలోని ఓ రక్త చరిత్ర తరహా సినిమాని తీయబోతున్నట్టు తాజాగా ప్రకటించారు. 

వివాదాస్పద, సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తాజాగా ఓ సంచలన సినిమాని ప్రకటించారు. మాజీ మంత్రి కొండా సురేఖ, కొండా మురళీ దంపతుల జీవితాల ఆధారంగా తెలంగాణలోని ఓ రక్త చరిత్ర తరహా సినిమాని తీయబోతున్నట్టు తాజాగా ప్రకటించారు. త్వరలోనే సినిమా ప్రారంభం కానుందని, పూర్తిగా వరంగల్‌, అక్కడి పరిసర ప్రాంతాల్లోని అడవుల్లో జరుగుతుందని తెలిపారు. దీనికి సంబంధించిన సమాచారం మాజీ నక్సలైట్లు, పోలీసు అధికారులు, కొండా మురళీ, సురేఖల నుంచి తీసుకున్నట్టు వెల్లడించారు. వాళ్లు తన ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకుని సినిమాకి సుముఖత వ్యక్తం చేసినట్టు వెల్లడించారు. 

ఈ సందర్భంగా వర్మ చెబుతూ, `నేను విజయవాడలో చదవటం మూలాన అక్కడి రౌడీయిజం గురించి తెలుసుకున్నా. రామానాయుడు స్టూడియోలో ఘటన కారణంగా రక్త చరిత్ర కథ గురించి తెలుసుకున్నా.  తెలంగాణ సాయుధ పోరాటం గురించి మొన్నటి వరకు కూడా ఏమీ తెలియదు. ఈ మధ్య నేను కలిసిన మాజీ నక్సలైట్లు, ఇంకొంత మంది అప్పటి పోలీస్‌ ఆఫీసర్ల నుంచి నాకు ఫస్ట్ టైమ్‌ ఆ సబ్జెక్ట్ మీద అవగాహన వచ్చింది. 

ఎన్‌కౌంటర్‌లో చంపేయబడ్డ ఆర్కే.. అలియాస్‌ రామకృష్ణ .. కొండా మురళికి ఉన్న మహా ప్రత్యేకమైన సంబంధం నన్ను బాగా ఆకర్షించింది. ఆ అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్‌, అప్పటి పరిస్థితులు సినిమాటిక్‌గా క్యాప్చర్‌ చేయడానికి నేను మురళీగారిని కూడా కలవడం జరిగింది. సపోర్ట్ చేయమని కోరడం జరిగింది. ఈ సినిమా తీయడం వెనకాల ఉన్న నా ఉద్దేశం విని ఆయన కూడా ఒప్పుకున్నారు. పెత్తందార్ల పెత్తనం భరించలేక కొంత మంది బడుగు వర్గాలు తిరగబడి.. మొత్తం వ్యవస్థతోనే పోరాడుతున్న రోజులవి. అలా ఎదురు తిరిగిన వాళ్లు ఉక్కు పాదాలతో తొక్కి పడేయడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ  మురళీ, ఆర్కే వంటి వారి నాయకత్వంలో తిరుగుబాటు చేసేవారు. 

విపరీత పరిస్థితుల నుంచే విపరీత వ్యక్తులు ఉద్భవిస్తారని చచ్చి ఏ లోకాన ఉన్నాడో గానీ ఆ మహానుభావుడు కార్ల్ మార్క్స్ 180ఏళ్ల క్రితమే చెప్పాడు. అలాంటి విపరీత పరిస్థితుల మధ్య పుట్టిన వాళ్లే కొండా మురళీ, కొండా సురేఖ. ఎనభైల్లో మొదలైన చరిత్ర కోరలు ఇప్పటి రాజకీయాలను కూడా కరుస్తూనే ఉన్నాయి. మున్ముందు కూడా రాజకీయాలను కరుస్తూనే ఉంటాయి. ఎందుకంటే విప్లవం అనేది ఎప్పటికీ ఆగదు. దాన్ని రూపు మార్చుకుంటుందంతే. తాను తీస్తున్నది సినిమా కాదు. నమ్మశక్యం కాని నిజ జీవితాల ఆధారంగా తీస్తున్న తెలంగాణలో జరిగిన ఓ రక్త చరిత్ర.  ఈ సినిమా విప్లవం అతి తర్వలో మొదలవ్వబోతుంది` అని వెల్లడించారు వర్మ. 

గతంలో వర్మ పరిటాల రవి జీవితం ఆధారంగా `రక్తచరిత్ర`, వంగవీటి రాధా కథతో `వంగవీటి`, ఎన్టీఆర్‌, లక్ష్మీ పార్వతి కథలతో `లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌`, వీరప్పన్‌ కథతో `కిల్లింగ్‌ వీరప్పన్‌` చిత్రాలు రూపొందించారు. ఇప్పుడు కొండా మురళీ, సురేఖ పోరాటాన్ని ఆవిష్కరించబోతున్నారు వర్మ. 

click me!