
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా దాదాపు ఖరారైనట్టే. ఇక ఈ సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డిదే నని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్ కోసం నిర్మాత, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తెగ ట్రై చేస్తున్నారట. ఇప్పటికే సుకుమార్ మూవీలో తనకు సమంతను కన్ఫమ్ చేసుకున్న చెర్రీ ఇప్పుడు నాన్న కోసం అనుష్కను ట్రై చేస్తున్నాడట.
మెగా అభిమానులు బాస్ ఈజ్ బ్యాక్ అంటూ వచ్చిన మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రాన్ని సూపర్ హిట్ చేసి అన్నయ్యకు గ్రాండ్ వెలకం చెప్పారు. ఫ్యాన్స్ ఇచ్చిన జోష్ తో వరుస సినిమాలతో బాక్సాఫీసును కుమ్మేందుకు బాస్ రెడీ అవుతున్నాడు. 2017లో మెగాస్టార్ రెండు సినిమాలు చేసేందుకు ప్రణాళికలు వేసుకున్నారు. 151వ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించబోతున్నారు. ఈ చిత్రాన్ని కూడా స్వయంగా రామ్ చరణే నిర్మించబోతున్నారు.
ఇక 152వ చిత్రం బోయపాటి దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మించబోతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మెగా 151వ సినిమాలో అనుష్కను హీరోయిన్ గా తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారట. వాస్తవానికి 150వ సినిమాలోనే అనుష్క నటించాల్సి ఉంది. అయితే అప్పుడు అనుష్క బాహుబలి ప్రాజెక్టులో బిజీగా ఉండటంతో డేట్స్ అడ్జెస్ట్ కాలేదు.
మరోవైపు మెగాస్టార్ పర్సనాలిటీకి పర్ఫెక్టుగా సూటయ్యే స్టార్ హీరోయిన్లు ఇండస్ట్రీలో ప్రస్థుతం ఒక్కరిద్దరే ఉన్నారు. వారిలో అనుష్క ముందుంటుంది. 151వ సినిమాకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుష్కనే తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట రామ్ చరణ్.
అనుష్క డేట్స్ దక్కించుకోవడానికి కొణిదెల ప్రొడక్షన్స్ టీం ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టిందట. బాహుబలి షూటింగ్ పూర్తయింది కాబట్టి అనుష్క మెగా 151వ మూవీలో నటించడం దాదాపు ఖరారైనట్టే కనిపిస్తోంది. మెగాస్టార్ నటించబోయే 151వ చిత్రం ఏప్రిల్ నెలలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దర్శకుడు సురేందర్ రెడ్డి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టినట్లు సమాచారం. అయితే ఈ సినిమా నేపథ్యం, కథ ఎలా ఉంటుందనేది ఇంకా బయటకు రాలేదు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిదేనని టాక్ అయితే వినిపిస్తోంది.