
ధృవ సినిమా తర్వాత రామ్ చరణ్ సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ధృవ రిలీజ్ అయి చాలా కాలం అవుతున్నా... ఇంత వరకు రామ్ చరణ్ తదుపరి సినిమా పట్టాలెక్కలేదు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాను చాలా రోజుల క్రితమే అధికారికంగా లాంచ్ చేసారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసేశారు. అయితే.. రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఇంకా స్టార్ట్ అవ్వలేదు.
రామ్ చరణ్ సరసన హీరోయిన్ ఎంపిక కోసం చాలా సమయం తీసుకున్న దర్శకుడు సుకుమార్.. తొలుత అనుపమ పరమేశ్వరన్ కు ఆ ఛాన్స్ ఇచ్చేశాడు. అధికారికంగా కూడా ప్రకటించేసుకుంది అనుపమ. అయితే సడెన్ గా అనుపమను కాదని సమంతను ఫిక్స్ చేశాడు. ఈ మేరకు యూనిట్ సభ్యుల నుంచి అధికారిక ప్రకటన కూడా వచ్చింది. మొత్తానికి రామ్ చరణ్ హీరోయిన్ ఫిక్స్ అయిపోయిందనుకుంటున్న సమయంలో తాజాగా మరో వార్త తెగ చక్కర్లు కొడుతోంది.
రామ్ చరణ్, సుకుమార్ ల కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా నుంచి సమంత తప్పుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అఖిల్, శ్రియాల పెళ్లి రద్దు కావటంతో చైతూ, సమంతల పెళ్లి వీలైనంత త్వరగా చేసే ఆలోచనలో ఉన్నారు అక్కినేని కుటుంబ సభ్యులు. అందుకే ఇప్పటికే కమిట్ అయిన అన్ని సినిమాల నుంచి సమంత తప్పుకుంటుందని సమాచారం.
ఇప్పటికే రామ్ చరణ్, సుకుమార్ ల ప్రాజెక్ట్ నుంచి రాశీఖన్నా, అనుపమా పరమేశ్వరన్ లను తప్పించారు. తాజాగా సమంత కూడా తప్పుకోవటంతో ముచ్చటగా మూడుసార్లు హీరోయిన్ రద్దయినట్లయింది. మరి ఈ సినిమాను 5 నెలల్లో పూర్తి చేసి దసరా కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఇంత వరకు హీరోయిన్ విషయమే ఫైనల్ కాకపోవటంతో అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ అవుతుందో లేదో అని టెన్షన్ పడుతున్నారు మెగా ఫ్యాన్స్.