
సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, 'మైఖేల్' బయోపిక్ చూసిన తర్వాత మైఖేల్ జాక్సన్ గురించి ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. 2009లో జాక్సన్ చనిపోయాడన్న వార్త విని తన ఫాంటసీ ప్రపంచం ఎలా బ్రేక్ అయ్యిందో గుర్తుచేసుకున్నారు. చనిపోయినందుకు మైఖేల్ జాక్సన్‌పై తనకు ద్వేషం అంటూ వర్మ సంచలన కామెంట్స్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే, 'మైఖేల్' బయోపిక్ చూశాక రామ్ గోపాల్ వర్మ, 'పాప్ కింగ్' మైఖేల్ జాక్సన్‌తో తనకున్న అనుబంధాన్ని ఓ సుదీర్ఘమైన పోస్ట్‌తో పంచుకున్నారు. తన కాలేజీ రోజుల నుంచి జాక్సన్ తన ఊహాలోకాన్ని ఎలా ప్రభావితం చేశాడో గుర్తుచేసుకున్నారు. జాక్సన్ మరణం, తాను ఇన్నేళ్లుగా నమ్ముతున్న ఒక ఫాంటసీని ముక్కలు చేసిందని వర్మ ఆవేదన వ్యక్తం చేశారు.
వర్మ X (ట్విట్టర్)లో పెట్టిన సుదీర్ఘ పోస్టులో, మైఖేల్ జాక్సన్ పై తనకు కోపం ఉందని, అది కూడా అతను చనిపోయినందుకే అని అన్నారు. ఎందుకంటే, ఆ మరణం అతడు కూడా ఒక సాధారణ మనిషే అనే నిజాన్ని తనకు తెలిసేలా చేసిందని పేర్కొన్నారు.
2009లో జాక్సన్ మరణవార్త విన్న రోజును గుర్తుచేసుకుంటూ వర్మ ఇలా రాశారు, "'మైఖేల్' సినిమా చూశాక, నా జ్ఞాపకాలన్నీ 2009 జూన్ 25 నాటి ఆ భయంకరమైన రోజుకు వెళ్లాయి. ఆ రోజు రాత్రి ఆలస్యంగా పడుకున్నా, టీవీ ఇంకా ఆన్‌లోనే ఉంది. తెల్లవారుజామున మత్తుగా నిద్రలేవగానే, టీవీ స్క్రీన్‌పై నల్ల బ్యాక్‌గ్రౌండ్‌లో తెల్ల అక్షరాలతో 'మైఖేల్ జాక్సన్ ఈజ్ డెడ్' అని రాసి ఉంది."
"కొన్ని క్షణాల పాటు ఇదొక పీడకల అనుకున్నా. ఇంత భయంకరమైన కల నాకెందుకు వచ్చిందని ఆలోచించా. కానీ టీవీలోని ఆ స్క్రోలింగ్ మాత్రం ఆగలేదు. రిమోట్ పట్టుకుని ఛానెల్స్ మార్చడం మొదలుపెట్టా. అన్ని ఛానెళ్లలోనూ యాంకర్లు చాలా సీరియస్‌గా ఇదే వార్తను చెబుతున్నారు. అప్పుడే నాకు జరగకూడనిది జరిగిపోయిందని అర్థమైంది," అని ఆయన రాసుకొచ్చారు.
తన ఇంజనీరింగ్ కాలేజీ రోజుల్లో విజయవాడలోని ఒక చిన్న వీడియో పార్లర్‌లో మొదటిసారి 'థ్రిల్లర్' పాటను చూసిన అనుభవాన్ని ఆయన పంచుకున్నారు. ఆ అనుభవాన్ని వర్మ వివరిస్తూ.. జాక్సన్ పెర్ఫార్మెన్స్.. సంగీతం, విజువల్స్ పట్ల తనకున్న అభిప్రాయాన్నే మార్చేసిందని అన్నారు.
"1984 జనవరి 2న, విజయవాడలో నా ఇంజనీరింగ్ రోజుల్లో, నా స్నేహితుడొకడు నువ్వు కచ్చితంగా ఒకటి చూడాలి అని చెప్పి నన్ను ఒక పాత వీడియో పార్లర్‌కు లాక్కెళ్లాడు. లైట్లు ఆగిపోయాయి, 'థ్రిల్లర్' నా కడుపులో గుద్దినట్టుగా మొదలైంది. అది కేవలం ఒక పాట లేదా డ్యాన్స్ కాదు. అదొక రకమైన దాడిలా అనిపించింది," అని ఆయన రాశారు.
జాక్సన్ వీడియోలు తనకు, చిత్ర పరిశ్రమలోని చాలా మందికి 'ఎవరూ అందుకోలేని ఒక స్థాయి'ని సెట్ చేశాయని వర్మ అన్నారు. 'Beat It', 'Billie Jean', 'Smooth Criminal', 'Black or White', 'Remember the Time', 'Bad' వంటి పాటలు తనకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని ఆయన తెలిపారు. జాక్సన్ మ్యాజిక్ తనతో ఎప్పటికీ ఉంటుందని చెబుతూ ఆయన తన పోస్ట్‌ను ముగించారు.
"నువ్వు ఇప్పుడు ఎక్కడున్నా, ఏ లోకంలో ఉన్నా, గెలాక్సీల మధ్య మూన్‌వాక్ చేస్తూనే ఉంటావు. నక్షత్రాలు కూడా బంధించలేని నీ ప్రతిభతో అంతరిక్షంలో తుపానులు సృష్టిస్తూనే ఉంటావు. విజయవాడలోని ఆ వీడియో పార్లర్‌లో నువ్వు నాకు ఇచ్చిన ఆ షాక్ నా చావు వరకు నాతోనే ఉంటుంది," అని ఆయన ముగించారు.