
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ (RRR) చిత్రంలో రామ్ చరణ్ క్రేజ్ రెండింతలైంది. సీతారామ రాజులో చరణ్ ఆడియెన్స్ ను అలరించారు. ఈ చిత్రం ఇంకా బాక్సాఫీసు వద్ద డీసెంట్ కలెక్షన్లతో ముందుకు వెళ్తూనే ఉంది. అయితే చరణ్ ప్రస్తుతం అయ్యప్ప మాలాధారణలో ఉన్నారు. పైగా ఆయన గురుస్వామి కావడంతో నియమ నిష్టలతో ధైవారాధన చేస్తున్నారు. తాజాగా ఈరోజు తన సతీమణి ఉపాసన (Upasana Konidela)తో కలిసి పంజాబ్ రాష్ట్రంలోని గోల్డెన్ టెంపుల్ లో లంగర్ సేవా నిర్వహించారు. అనంతరం రామ్ చరణ్ అమృత్‌సర్‌లోని ఖాసాలో గల BSF శిబిరాన్ని సందర్శించారు.
అయితే, RRR భారీ విజయం సాధించడంతో రామ్ చరణ్ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తన నెక్ట్స్ ఫిల్మ్ RC15 షూటింగ్‌లో ఉన్నారు. ఈ చిత్ర షూటింగ్ అమృత్‌సర్‌లో జరుగుతున్న సందర్భంగా అక్కడికి వెళ్లారు. ప్రస్తుతం కియారా అద్వానీ (Kiara Advani) మరియు రామ్ చరణ్ తమ రాబోయే పొలిటికల్ డ్రామా 'RC 15' షూటింగ్ కోసం అమృత్‌సర్‌లో ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత దిల్ రాజు, శిరీష్ ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ మూడు భాషల్లో విడుదల కానుంది.
కాగా, చరణ్ లంగర్ సేవా కార్యక్రమం సందర్భంగా ముఖ్యంగా BSF సైనికులకు ప్రత్యేక వంటకాలతో ఆతిథ్యం ఇచ్చారు. ఇదే విషయాన్ని చరణ్ తన ఇన్ స్టా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. BSF సైనికులతో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘బిఎస్ఎఫ్ క్యాంప్, ఖాసా అమృత్‌సర్ వద్ద సరిహద్దు భద్రతా దళాన్ని కలుసుకోవడం సంతోషంగా ఉంది. వారి కథలు, త్యాగాలు, అంకితభావాలను వింటూ స్ఫూర్తిదాయకమైన మధ్యాహ్నం గడిపాను’ అని రామ్ చరణ్ క్యాప్షన్ ఇచ్చారు.
ఇదే విషయాన్ని చరణ్ వైఫ్ ఉపాసన కొణిదెల కూడా సోషల్ మీడియాలో ద్వారా తెలియజేసింది. ఈ సందర్భంగా లంగర్ సేవాకు సంబంధించిన వీడియోను కూడా షేర్ చేసింది. ఈ వీడియోను షేర్ చేస్తూ ఇలా రాసుకొచ్చింది. ‘కృతజ్ఞతా చిహ్నంగా రామ్ చరణ్ అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలో లంగర్ సేవను నిర్వహించారు. తను RC 15 షూటింగ్‌లో ఉన్నందున, అతనికి ప్రాతినిధ్యంగా సేవలో పాల్గొనేందుకు ప్రత్యేక హక్కు, అవకాశం నాకు లభించింది. రామ్ చరణ్ మరియు నేను అక్కడి పెద్దల ఆశీర్వాదం పొందాము’ అంటూ నోట్ రాసింది.