
మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే శంకర్.. మరో పక్క కమల్ హాసన్ ఇండియన్ 2 చిత్రాన్ని కూడా తెరకెక్కిస్తున్నారు. దీనితో గేమ్ ఛేంజర్ ఆలస్యం అవుతూ వస్తోంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా శంకర్ ఈ చిత్రాన్ని తనదైన శైలిలో తెరకెక్కిస్తున్నారు.
ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ నల్గొండ జిల్లాలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు శంకర్ రాంచరణ్ పై భువనగిరి మండలం నాగిరెడ్డి పల్లి గ్రామ పరిథిలో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అక్కడ ఉన్న బియ్యం గోదాములో ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది. షూటింగ్ లొకేషన్ నుంచి రామ్ చరణ్ పిక్ ఒకటి లీకై వైరల్ గా మారింది.
అంతే కాదు కీలక సన్నివేశానికి సంబంధించిన వివరాలు కూడా లీక్ అయ్యాయి. ఈ చిత్రంలో రాంచరణ్ ప్రభుత్వ అధికారిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. గోదాములో కల్తీ బియ్యంని పట్టుకునే సన్నివేశం చిత్రీకరణ జరుగుతోందని అంటున్నారు. చూస్తుంటే శంకర్ ఒకేఒక్కడు చిత్ర వైబ్స్ కనిపిస్తున్నాయి. ఆ మూవీలో కూడా హీరో అర్జున్ వన్ డే సీఎం గా పలు రంగాలపై నిఘా పెట్టి అవినీతిని అంతం చేస్తాడు. గేమ్ ఛేంజర్ కూడా అదే తరహా చిత్రం అనిపిస్తోంది.
కానీ అక్కడ ఉన్నది డైరెక్టర్ శంకర్ కాబట్టి గేమ్ ఛేంజర్ చిత్రానికి మరో చిత్రంతో పోలిక లేకుండా జాగ్రత్తలు తీసుకుంటారని అంటున్నారు. లీకైన పిక్ లో రాంచరణ్ ముఖానికి మాస్క్ పెట్టుకుని ఉన్నాడు. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. దిల్ రాజు నిర్మాత. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి.