
టాలీవుడ్ లక్కీ హీరోయిన్ రకుల్‌ప్రీత్‌సింగ్‌ను చూస్తే కుర్రకారుకు యమా ఎట్రాక్షన్. తన అందంతో తెలుగు యువతను మెస్మరైజ్ చేస్తున్న ఈ పంజాబీ భామ ప్రస్తుతం తెలుగులో అగ్రనాయికల్లో ఒకరుగా దూసుకెళుతోంది. గతంలో తమిళంలో రెండు, మూడు సినిమాలు చేసిన ఈ బ్యూటీ ఈ ఏడాది అక్కడ కూడా స్టార్ హీరోయిన్ల లిస్ట్‌లో చేరే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
ఇప్పటికే మహేష్బాబు హీరోగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్న రకుల్.. తమిళంలో కార్తీ సరసన ‘ధీరన్ అధికారం ఒండ్రు’ అనే మరో సినిమాలో నటిస్తోంది. తాజాగా కార్తీ సోదరుడు సూర్య సరసన సినిమా చేసే బంపర్ ఆఫర్ దక్కించుకున్నారని చెన్నై కోడంబాక్కమ్ సమాచారం. ఇటీవల ‘సింగం 3’ హిట్‌తో మాంచి ఊపు మీదున్న సూర్య ప్రస్తుతం విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో హిందీ చిత్రం ‘స్పెషల్ ఛెబ్బీస్’ రీమేక్ ‘తానా సేంద కూట్టమ్’లో నటిస్తున్నారు.
ఆ చిత్రం తర్వాత సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు సూర్య. ఈ చిత్రంలో సూర్యకు జోడీగా రకుల్‌ను ఎంచుకున్నారని సమాచారం. మొత్తానికి తెలుగులో లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రకుల్ ఇక తమిళంలోనూ తన క్రేజ్ పెంచుకోనుందన్నమాట.