క్రిమినల్ కేసులు పెడతామంటూ రజనీ వార్నింగ్ నోటీస్

By Surya PrakashFirst Published Jan 29, 2023, 12:00 PM IST
Highlights

 జన్మతః మరాఠీ అయినప్పటికీ, కర్ణాటకలో పుట్టిపెరిగి, తమిళులకు ఆరాధ్య నటుడిగా ఎదిగారు. ఉత్తమ నటడిగా తన కెరీర్ లో ఎన్నో సినిమాలకు ఆయన రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి అవార్డులు అందుకున్నారు. 


తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ బహిరంగ హెచ్చరిక జారీ చేసి ఆశ్చర్యపరిచారు. రజనీకాంత్ పేరు, ఫొటో, మాటలు లేదా ఆయనకు సంబంధించిన విలక్షణతలు, ప్రత్యేకతలను వినియోగించడం ద్వారా.. వ్యక్తిత్వం, సెలబ్రిటీ హక్కులను ఉల్లంఘించినట్టయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నటుడి తరఫు న్యాయవాది ఎస్ ఎలంభారతి పబ్లిక్ నోటీసు విడుదల చేశారు. ఇన్నాళ్లూ మన రజనీకాంత్ కదా అని ఇష్టం వచ్చినట్లు ఆయన ఫొటోలు వాడుతూ వస్తున్నారు. ఆయన డైలాగులు వాడేస్తున్నారు. అయితే ఇక నుంచి అలా కుదరదు.

‘‘రజనీకాంత్ ఓ సెలబ్రిటీ హోదాలో ఉన్నారు. వాణిజ్య పరంగా రజనీకాంత్ వ్యక్తిత్వం, పేరు, మాటలు, ఫొటోలను ఉపయోగించే హక్కులపై ఆయనకే నియంత్రణ ఉంది. కొన్ని వేదికలు, మాధ్యమాలు, ఉత్పత్తుల తయారీదారులు రజనీకాంత్ పేరు, మాటలు, ఫొటోగ్రాఫ్, వ్యంగ్య చిత్రం, నటనకు సంబంధించిన చిత్రాలను దుర్వినియోగం చేస్తున్నారు. ఇలాంటి చర్యల ద్వారా ప్రజాదరణను పొందుతూ తమ ఉత్పత్తులను కొనుగోలు చేసేలా లేదా తమ ప్లాట్ ఫామ్ లకు వచ్చే చర్యలకు పాల్పడుతున్నాయి’’అని సదరు నోటీసులో పేర్కొన్నారు. 

‘‘నటుడు, మానవతావాది కావడం, ఆయనకున్న ఆకర్షణతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది సూపర్ స్టార్ గా పిలుస్తున్నారు. చలనచిత్ర పరిశ్రమలో ఆయనకున్న గౌరవం, అభిమానుల సంఖ్య సాటిలేనిది. వివాదం లేనిది. ఆయనకున్న ప్రతిష్ఠ లేదా వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తే  అది నా క్లయింట్ (రజనీకాంత్)కు ఎంతో నష్టం’’అని ఎలంభారతి పేర్కొన్నారు. 

ఇదిలా ఉండగా..సూపర్ స్టార్ రజనీకాంత్  తాజాగా తన కెరీర్ ఆరంభంలో తనకున్న చెడు అలవాట్లను గురించి వెల్లడించారు. ఇటీవలే చెన్నైలో వై జీ మహేంద్రన్ ‘చారుకేసి’ కార్యక్రమం 50వ రోజు సంబరాలు జరిగాయి. ఈ వేడుకకు భార్య లతతో కలసి రజనీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రజనీకాంత్ తన జీవిత భాగస్వామి లతను పరిచయం చేశారు. 

తాను కండక్టర్ గా పనిచేసే రోజుల్లో సిగరెట్లు, మద్యపానం, మాంసాహార అలవాట్లు ఉండేవన్నారు. నటుడిగా కెరీర్ మొదట్లోనూ ఈ అలవాట్లు కొనసాగినట్టు వివరించారు. లత వల్లే వీటిని మానినట్టు చెప్పారు. 

‘‘నాకు లతను పరిచయం చేసిన వై జీ మహేంద్రన్ కు జీవితాంతం రుణపడి ఉంటాను. నేను కండక్టర్ గా ఉన్న రోజుల్లో ప్రతి రోజూ మద్యం తాగేవాడిని. రోజూ ఎన్ని సిగరెట్లు తాగేవాడినో లెక్కే ఉండేది కాదు. మాంసాహారంతోనే రోజు మొదలు పెట్టేవాడిని. రోజూ కనీసం రెండు సార్లు మాంసాహార భోజనం చేసేవాడిని. ఆ సమయంలో శాకాహారులను చూసి బాధపడేవాడిని. కానీ, ఈ మూడూ చాలా ప్రమాదకరమైన కాంబినేషన్. 

ఈ మూడు అలవాట్లను దీర్ఘకాలం పాటు కొనసాగించిన వారు 60 ఏళ్ల తర్వాత ఆరోగ్యకరమైన జీవితం సాగించలేరు. ఈ విషయంలో నా భార్య లత పాత్ర కీలకం. ఆమె తన ప్రేమతో నేను వీటిని మానేలా చేసింది. క్రమశిక్షణతో జీవించేలా నన్ను మార్చింది’’అని రజనీకాంత్ సభలో వివరించారు.
 

click me!