సూపర్ స్టార్ రజనీకాంత్ ఇప్పటికే ఓ సినిమా పూర్తి చేశాడు. ఇప్పుడు మరో సినిమా చేయబోతున్నాడు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్‌తో ఢీ కొట్టబోతున్నాడనే ప్రచారం జరుగుతుంది.
సూపర్ స్టార్ రజనీకాంత్.. ఓ సినిమా పూర్తయ్యేలోపు మరో సినిమాని లైన్‌లో పెడుతున్నాడు. ఇప్పటికే ఆయన `వెట్టయాన్` అనే మూవీని పూర్తి చేశాడు. `జై భీమ్` ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ మూవీ దసరా కానుకగా విడుదల కాబోతుంది. ఇటీవలే యూనిట్ ఆ విషయాన్ని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు రజనీకాంత్ మరో సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో `కూలీ` సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ జరుగుతుంది.
ఇందులో మరో సూపర్ స్టార్‌ని దించుతున్నాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఆయన తన ప్రతి సినిమాలో ఇద్దరు ముగ్గురు పెద్ద స్టార్స్ ఉండేలా చూసుకుంటారు. ప్యాడింగ్‌లో బిగ్ స్టార్స్ ని దించడం విశేషం. కమల్ హాసన్‌తో చేసిన `విక్రమ్` చిత్రంలో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్‌ని, చివరకు క్లైమాక్స్ లో సూర్యని కూడా దించాడు. ఇటీవల విజయ్‌తో చేసిన `లియో`లో కూడా అర్జున్, సంజయ్ దత్‌ని తీసుకున్నారు. వీరికి విలన్లుగా చూపించాడు.
ఇప్పుడు రజనీకాంత్‌తో `కూలీ` సినిమా చేస్తున్నాడు లోకేష్. ఆ మధ్యనే దీనికి సంబంధించిన గ్లింప్స్ విడుదల చేశారు. గోల్డ్ వాచ్ సింబాలిక్‌గా ఈ కాన్సెప్ట్ గ్లింప్స్ ని విడుదల చేశారు. అదిరిపోయింది. అయితే ఈ సినిమాలో ఎవరు కనిపించబోతున్నారనేది సస్పెన్స్ గా మారిన నేపథ్యంలో కాస్టింగ్ ని రివీల్ చేస్తున్నారు టీమ్. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోక్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఇందులో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్రని దించుతున్నాడు లోకేష్. రజనీకాంత్ తోపాటు ఉపేంద్ర కూడా కనిపిస్తాడట. అయితే ఇందులో ఉపేంద్రది నెగటివ్ రోల్ అని సమాచారం. రజనీకాంత్‌ని ఢీ కొట్టే పాత్రలో ఉపేంద్ర కనిపిస్తారని తెలుస్తుంది. నిజం ఏంటనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఉపేంద్రతో రజనీ ఫైటింగ్ అంటే అది వేరే స్థాయిలో ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
లోకేష్ కనగరాజ్ `ఖైదీ`, `మాస్టర్`ల కంటే `విక్రమ్`తో తన రేంజ్ ఏంటో చూపించాడు. కమల్ కి కెరీర్ బెస్ట్ ని అందించాడు. కానీ ఆస్థాయిలో `లియో`కి పేరు రాలేదు. కలెక్షన్ల పరంగా బాగానే వినిపించింది. మరి ఇప్పుడు రజనీకాంత్‌ని ఏ రేంజ్‌లో చూపించబోతున్నాడనేది ఆసక్తికరంగా మారింది. లోకేష్ వంటి మాస్ డైరెక్టర్, రజనీకాంత్ వంటి మాస్ హీరోని డీల్ చేస్తే ఏ రేంజ్‌లో ఉండబోతుందో `కూలీ`తో చూపించబోతున్నాడట లోకేష్. దీంతో సినిమా ప్రారంభం నుంచే అంచనాలు బాగా పెరిగాయి. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.