
దర్శక ధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో భారీ గ్లోబల్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. SSMB 29 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది. త్వరలో ఈ చిత్ర యూనిట్ లాంగ్ షెడ్యూల్ కోసం కెన్యాకి వెళ్ళబోతున్నారు. కెన్యాలో నెలరోజుల షూటింగ్ పూర్తయ్యాక తిరిగి హైదరాబాద్ కి వస్తారు.
మహేష్ బాబు చిత్రం కోసం రాజమౌళి పెద్ద సాహసం చేస్తున్నారు. ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత ఖరీదైన సెట్ ని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. వారణాసి నగరాన్ని హైదరాబాద్ లో రీ క్రియేట్ చేసేందుకు భారీ సెట్ నిర్మిస్తున్నారట. ఈ సెట్ కోసం ఊహకి కూడా అందని విధంగా ₹50 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.
వారణాసి వీధుల్లో చిత్రీకరించాల్సిన చాలా సన్నివేశాలు ఈ చిత్రంలో ఉన్నాయట. నేరుగా వారణాసి వెళ్లి అక్కడ వీధుల్లో ఎక్కువకాలం షూటింగ్ చేయడం సాధ్యం కాదు. పోలీసువారి అనుమతులు, పబ్లిక్ తాకిడి ఇలా చాలా సమస్యలు ఉంటాయి. అందువల్ల రామోజీ ఫిలింసిటీలో సెట్‌ను భారీగా నిర్మించి, ప్రసిద్ధ ఘాట్‌లు, దేవాలయాలు, నది తీరాలు తదితర కీలక వరణాసి భాగాలను రీ క్రియేట్ చేయాలని నిర్ణయించుకున్నారు. తెరపై ఈ సెట్ లు సహజ సిద్ధంగా నిజమైన వారణాసి నగరంలా కనబడేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
స్క్రీన్‌పై వారణాసి నగరం అద్భుతంగా ప్రతిబింబించేలా సన్నాహకాలు చేస్తున్నారు. మొత్తం సెట్ నిర్మాణం అక్టోబర్, నవంబర్ నెలల్లో పూర్తి కానున్నట్లు తెలుస్తోంది.
దీనితో రాజమౌళి, మహేష్ బాబు చిత్రం ఇండియన్ సినిమా చరిత్రలో అత్యంత కాస్ట్లీ సెట్ కలిగిన చిత్రంగా రికార్డు సృష్టించబోతోంది. సంజయ్ లీలా భన్సాలి ‘దేవదాస్’, ‘బాజిరావ్ మస్తాని’, ‘హీరమండీ’, ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ వంటి సినిమాల సెట్ లు అత్యంత కాస్ట్లీ సెట్స్ గా రికార్డ్స్ లో ఉన్నాయి. ఈ చిత్రాల సెట్ ల ఖరీదు 15 కోట్ల నుంచి 20 కోట్ల వరకు ఉంటుంది. అంటే చాలా భారీ తేడాతో మహేష్, రాజమౌళి చిత్ర సెట్ అగ్ర స్థానంలో నిలవబోతోంది.
మహేష్ బాబుతో పాటు ప్రముఖ నటి ప్రియాంక చోప్రా, మలయాళీ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సంగీతం ఎం.ఎం. కీరవాణి అందిస్తుండగా సినిమాటోగ్రఫీ పి.ఎస్. వినోద్, ఎడిటింగ్ తమ్మిరాజు, ప్రొడక్షన్ డిజైన్ అవినాష్ కొల్ల అందిస్తున్నారు.
ఈ ప్రాజెక్టు మొత్తం బడ్జెట్ ₹1,000 కోట్లకి పైగా,ఉండబోతోంది. ఇది భారత చలనచిత్రాల చరిత్రలోనే అత్యంత ఖరీదైన చిత్రంగా చెబుతున్నారు. ఈ గ్లోబల్ అడ్వెంచర్ చిత్రంలో మహేష్ బాబు సాహస వీరుడిగా నటిస్తున్నారు. ఇందులో మహేష్ బాబు పురాణాల్లో ఆంజనేయ స్వామి పాత్ర ఆధారంగా రూపొందించినట్లు సమాచారం. ఆంజనేయ స్వామి సంజీవని పర్వతాన్ని తీసుకునివచ్చే కథాంశం ఈ చిత్రంలో అంతర్లీనంగా ఉంటుందట.
ఇదిలా ఉండగా మహేష్ బాబు చివరగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం చిత్రంలో నటించారు. గత ఏడాది సంక్రాంతికి విడుదలైన గుంటూరు కారం చిత్రం ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటించారు.