
ఎపిసోడ్ ప్రారంభంలో ఉత్కంఠ పరిస్థితుల్లో పెళ్లి అయిపోతుంది. తర్వాత పంతులుగారు మాట్లాడుతూ పెళ్ళికి ముందు ఇక్కడ పెద్ద యుద్ధమే జరిగింది. ఇక్కడ పెళ్లి జరగదని నాతో సహా అందరూ అనుకున్నారు కానీ జరిగింది ఎందుకంటే ప్రాప్తం. దేవుడు తలుచుకుంటే మనుషుల్ని ఎంతలాగా వెనక్కి లాక్కురాగలడో అర్థమైందా? ఆ శక్తి దేనిదో తెలుసా ఈ బ్రాహ్మముడిది.
ఈ బ్రహ్మముడిని విప్పడం బ్రహ్మ తరం కూడా కాదంటారు. మనసు కోరుకోకపోయినా మనువైందంటే దాని అర్థం ఆ జంట ఒకటవ్వాలని ముందే నిర్ణయించబడింది. వేదమంత్రాల సాక్షిగా మండపంలోకి ఆహ్వానించిన దేవతలు అందరూ ఈ జంటకి విడదీయరాని బంధం వేసి ఆశీర్వదించి వెళ్లిపోయారు అంటూ దంపతులిద్దరిని ఏడు అడుగులు వేయమంటారు.
తర్వాత కూతురు దగ్గరికి వచ్చిన కనకం ఇన్నాళ్లు ఇంటిని ఇలవేల్పులాగా కాపాడుకుంటూ వచ్చావు నువ్వు వెళ్ళిపోతుంటే ఇంటి మహాలక్ష్మి వెళ్ళిపోతున్నట్లుగా ఉంది అంటూ కన్నీరు పెట్టుకుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో నిన్ను వాళ్లకి అప్పచెప్తున్నాను. అప్పగింతలు పెట్టే అర్హత నాకు లేదు అందరి దృష్టిలో నేను మోసగత్తెని అయిపోయాను. నా గురించి వాళ్లు ఏమన్నా పట్టించుకోవద్దు.
నేను చేసిన తప్పు అలాంటిది నువ్వైనా సుఖంగా ఉండు అంటుంది కనకం. భూదేవి లాగా ఓర్పుగా ఉండు, నిన్ను నువ్వే కాపాడుకుంటూ అత్తింటికి పేరు తీసుకురావాలి అంటూ జాగ్రత్తలు చెప్తుంది కామాక్షి. నేను ఇంట్లో ఒక్కదాన్నే అయిపోయాను అమ్మ.. తిడితే నన్ను ఎవరు వెనకేసుకొస్తారు, నువ్వు లేకపోతే మేము ఏమైపోతాం అంటూ ఏడుస్తుంది అప్పు.
ప్రతి తండ్రి కూతురికి ఉన్నంతలో ఘనంగా పెళ్లి చేయాలనుకుంటాడు నేను కూడా అలాగే కలలు కన్నాను. అమ్మ చేసిన తప్పు ఆ దేవుడు లీలో తెలియదు కానీ అతనితో నీకు ముడి పడిపోయింది ఇందులో మీ అమ్మ తప్పు ఎంత ఉందో నా అసమర్థత కూడా అంతే ఉంది నన్ను క్షమించు అంటాడు కృష్ణమూర్తి. ఆ మాటలకి కన్నీరు పెట్టుకుంటుంది కావ్య.
ఇక నుంచి అదే నీ ఇల్లు అది దుగ్గిరాల వారి వంశం, అది గొప్ప వంశం అందులోనూ ఉమ్మడి కుటుంబం. ఇప్పుడు జరిగిందాన్ని మర్చిపోవటానికి వాళ్లకి చాలా సమయం పట్టొచ్చు వాటన్నింటినీ నువ్వే భరించాలి. నీకు బాధ గాని కోపం గాని వస్తే ఏ దేవుడు పటానికో చెప్పుకో అంతేగాని అత్తింటి గడప దాటకు. నీ మంచితనంతో అత్తింట్లో గుర్తింపు తెచ్చుకో అంటూ కూతుర్ని హత్తుకొని కన్నీరు పెట్టుకుంటాడు కృష్ణమూర్తి.
మరోవైపు వారసుడివి అంటే నువ్వు నీది చాలా విశాలమైన మనసు. మీడియాలో వస్తున్న వార్తలకి ఫుల్ స్టాప్ పెట్టావు కీప్ ఇట్ అప్ అని రాజ్ ని మెచ్చుకుంటాడు అతని బాబాయ్. నువ్వు కోపం తెచ్చుకోను అంటే ఒక మాట చెప్తాను కావ్యకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లి పీటల మీద కూర్చుంది తప్ప మనల్ని మోసం చేయాలని కాదు అంటాడు కళ్యాణ్.
సంతోషంగా జరగాల్సిన పెళ్లి గొడవలతో ముగిసింది అంటుంది చిట్టి. నీ ఇష్టాన్ని పక్కనపెట్టి కుటుంబం పరువు నిలబెట్టడం కోసం నువ్వు చేసిన ఈ పని నిజంగా చాలా గొప్పది అంటాడు సీతారామయ్య. అపర్ణ అక్క వస్తే ఏం జరుగుతుందో అని భయంగా ఉంది అంటుంది ధనలక్ష్మి. మరోవైపు ఇంటికి వచ్చిన అపర్ణ ఒక్కగానోక్క కొడుకు సంతోషంగా పెళ్లి చేసుకొని ఇంటికి వస్తున్నాడు.
పుట్టింటి దుఃఖాన్ని అక్కడే వదిలేయాలి సంతోషంగా ఆహ్వానం పలకాలి అనుకుంటూ ఇంట్లో అడుగుపెడుతూనే నా కోడలు వస్తుంది, దీపం వెలిగిస్తుంది పూజ గదిని శుభ్రం చేయు అంటూ పనిమనిషికి చెప్పి స్నానానికి వెళుతుంది అపర్ణ. మరోవైపు కావ్యని కార్ ఎక్కించుకోకుండానే ఇంటికి వెళ్ళిపోదాం పదా అంటాడు రాజ్. నీకు పెళ్లయింది భార్యని తీసుకు వెళ్ళకుండా వెళ్ళకూడదు అంటాడు కళ్యాణ్.
ఒక ట్రక్ పంపిద్దాం బొమ్మల్ని వేసుకొని వస్తుంది ముందు పోనీ అంటూ కోప్పడతాడు రాజ్. అప్పుడు మీడియా మనకన్నా ముందు వెళ్లి మన ఇంటిముందు ఉంటుంది. అంతకన్నా ముందు ఈ వార్త టీవీలో ఉంటుంది పెళ్లి కూతుర్ని మండపంలోనే వదిలేసిన పెళ్ళికొడుకు అని.. అంటూ నచ్చ చెప్తాడు కళ్యాణ్. కావ్యని కారు ఎక్కించబోతు మనం మోసం చేశామన్నది నిజం.
వాళ్ళు మోసపోయారు. వాళ్ళు అదే మాటని పదేపదే అంటారు ఎన్ని కష్టాలైనా ఎదుర్కొని నువ్వు ఆ ఇంట్లోనే ఉండాలి. గడప దాటి బయటకు వస్తే ప్రపంచం నిన్ను నన్ను బ్రతకనివ్వదు ప్రాణానికి ప్రమాదం రానంతవరకు నువ్వు సహనంతో ఉండాలి అంటూ కూతురుకి జాగ్రత్తలు చెప్తాడు కృష్ణమూర్తి. చీర,సారేతో కాకుండా పుట్టెడు దుఃఖంతో అత్తింటికి పంపుతున్నాము అయినా నువ్వు సమర్థవంతంగా నెట్టుకు వస్తావన్న నమ్మకం నాకుంది అంటుంది కామాక్షి.
మనం మట్టి పిసికి బొమ్మను చేసి రంగులు వేసి అమ్ముతాం అప్పుడు తను పరాయి ఇంటికి వెళ్లిందని బాధపడతామా ఇప్పుడు కూడా అలాగే అనుకో, నువ్వు నేర్పించిన పట్టుదల నాకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాయి నాన్న నువ్వు ఏడవద్దు అంటూ తండ్రి కన్నీరు తుడుస్తుంది కావ్య. ఇదంతా కార్ లోంచి చూస్తున్న రాజ్ లోపల నాటకాలు అయిపోయాయి ఇప్పుడు వీధి నాటకాలు మొదలుపెట్టారా? కారు ఖాళీగా ఉంది వస్తే తీసుకెళ్తాం.
లేకపోతే మా అదృష్టం అంటూ వెళ్ళిపోతాం అంటూ కోపంగా చెప్తాడు రాజ్. ఏడుస్తూ అందరికీ వీడ్కోలు చెప్పి కారు పెట్టి వెళ్ళిపోతుంది కావ్య. ఆమె వెళ్లిపోయిన తర్వాత నా ఇంటి మహాలక్ష్మి గడప దాటి వెళ్ళిపోయింది నా ఇల్లు శూన్యం అయిపోయింది అంటూ కామాక్షి తో చెప్పి బాధపడుతుంది కనకం. అంతలో కామాక్షి చేతిలో ఉన్న బ్యాగ్ ని చూసిన అప్పు ఇది అక్కది.ఇది లేకపోతే అక్కకి తోచదు అంటూ బ్యాగు పట్టుకుని కారు వెనుక పరిగెడుతుంది.
తర్వాత భాగంలో ఇంట్లోకి వస్తున్న రాజ్ ని ఆపి హారతి ఇవ్వకుండా లోపలికి రాకు మీ జంట మీద ఎంతమంది కళ్ళు పడ్డాయో అంటూ హారతి పళ్ళెంతో వస్తుంది అపర్ణ. స్వప్న ఏది అని రాజ్ ని అడుగుతుంది అతను మౌనంగా ఉంటే కళ్యాణ్ ని అడుగుతుంది. కళ్యాణ్ పక్కకు తప్పుకోవడంతో వెనకన పెళ్లికూతురు ముస్తాబులో ఉన్న కావ్య ని చూసి షాక్ అవుతుంది. ఎలాంటి కుటుంబం మీది, ఎలాంటి కుటుంబం మాది. నువ్వు ఎప్పటికీ ఈ ఇంటికి కోడలి కాలేవు వెళ్ళు అంటూ కేకలు వేస్తుంది అపర్ణ.