ఇంటికొస్తే బిర్యానీ పెడతా.. `నాటు నాటు` కి అవార్డు రావడంపై రాహుల్‌ సిప్లిగంజ్‌ ఎమోషనల్‌

By Aithagoni RajuFirst Published Jan 11, 2023, 6:55 PM IST
Highlights

తాను పాడిన `నాటు నాటు` పాటకి గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు రావడంపై తన సంతోషాన్ని పంచుకున్నారు రాహుల్‌ సిప్లిగంజ్‌. హైదరాబాదీ బిర్యానీతో సెలబ్రేట్‌ చేసుకుంటానని తెలిపారు. అంతేకాదు బిర్యానీ ఆఫర్‌ చేశారు. 

తాను కాళభైరవతో కలిసి పాడిన `నాటు నాటు` పాటకి ప్రతిష్టాత్మక గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు దక్కిన నేపథ్యంలో సింగర్‌ రాహుల్‌ సిప్టిగంజ్‌ తన ఆనందాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆకాశంలో విహరిస్తున్నారు. ఆనందానికి అవదుల్లేవని చెప్పొచ్చు. వరుసగా సెలబ్రిటీలు, పొలిటికల్‌ లీడర్లు ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు. దీంతో తన సంతోషాన్ని పంచుకున్నారు రాహుల్‌ సిప్లిగంజ్‌. హైదరాబాదీ బిర్యానీతో సెలబ్రేట్‌ చేసుకుంటానని తెలిపారు. అంతేకాదు బిర్యానీ ఆఫర్‌ చేశారు. తన ఇంటికొస్తే బిర్యానీ తినిపిస్తానని వెల్లడించారు.

రాహుల్‌ సిప్లిగంజ్‌ జాతీయ మీడియాతో మాట్లాడుతూ, `నాటు నాటు`పాట గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుని అందుకోవడం చాలా సంతోషంగా, ఎమోషనల్‌గా ఉంది. ఇది గత జర్నీని గుర్తు చేస్తుంది. కొరియోగ్రాఫర్‌ ప్రేమ్‌రక్షిత్‌ మాస్టర్‌, ఎన్టీఆర్‌ సర్‌, రామ్‌చరణ్‌ సర్‌లకు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. సినిమాని ఆడియెన్స్ భారీ స్థాయిలో ఆదరించి సంచలన విజయాన్ని అందించారు. ఈ పాటలోని స్టెప్పులు ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా బాగా వైరల్‌ అయ్యాయి. ఈ సందర్భంగా నా ఇంటికి వచ్చే వారికి హైదరాబాదీ బిర్యానీతో సత్కరించాలనుకుంటున్నా. ఇలా బిర్యానీతో నా సెలబ్రేషన్‌ స్టార్ట్ చేస్తా` అని తెలిపారు రాహుల్‌ సిప్లిగంజ్‌. దీంతో రాహుల్‌ ఎంతటి ఆనందంలో ఉన్నారనే విషయం అర్థమవుతుంది. 

మరోవైపు తనకు అభినందనలు తెలిపిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు రాహుల్‌. ప్రధాని మోడీకి ఆయన ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పారు. `మీ నుంచి ప్రత్యేక ప్రశంసలు అందుకున్నందుకు ఆనందంగా ఉంది సర్‌. గుర్తించినందుకు చాలా థ్యాంక్స్. ఇది నిజంగా నాకు సంతోషాన్ని కలిగిస్తుంది. మీ నుంచి ఈ ట్వీట్‌ రావడం నిజంగా ఈ రోజు చాలా ప్రత్యేకమైనది` అంటూ ట్వీట్‌ చేశారు రాహుల్‌. 

రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా నటించారు. అలియాభట్‌, అజయ్‌ దేవగన్‌, శ్రియా, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. గతేడాది మార్చిలో విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 1200కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు ఆస్కార్‌ బరిలో నిలిచింది. 

click me!