
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆరడుగుల ఆజానుబాహుడు రానా దగ్గుబాటి కలసి నటించిన భీమ్లా నాయక్ చిత్రం ప్రేక్షకుల మాస్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అయిపోయింది. నేడు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. సాగర్ చంద్ర దర్శకత్వంలో.. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లేలో ఈ చిత్రం తెరకెక్కింది. మలయాళీ చిత్రం అయ్యప్పన్ కోషియంకి ఇది రీమేక్.
యూఎస్ తో పాటు తెలంగాణలో కూడా ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. ఎక్కడ చూసిన థియేటర్స్ వద్ద పవన్ కళ్యాణ్ నినాదాలతో ఫ్యాన్స్ హోరెత్తిస్తున్నారు. భీమ్లా నాయక్ చిత్రానికి ఆల్రెడీ బ్లాక్ బస్టర్ టాక్ మొదలైపోయింది.
ఇక భీమ్లా నాయక్ చిత్రానికి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సెలెబ్రిటీలు వరుసగా భీమ్లా నాయక్ చిత్రం ఘనవిజయం సాధించాలని కోరుతూ ట్వీట్స్ చేస్తున్నారు. తాజాగా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు భీమ్లా నాయక్ చిత్రానికి తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలియజేశారు.
'పవర్ తూఫాన్ రేపటి నుంచి థియేటర్లలో… భీమ్లా నాయక్ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. టీం అందరికి కృతజ్ఞతలు…' అని రాఘవేంద్ర రావు ట్వీట్ చేశారు.
యువ దర్శకులు సంపత్ నంది, అనిల్ రావిపూడి, విక్టరీ వెంకటేష్, నటుడు సత్యదేవ్ లాంటి వారంతా భీమ్లా నాయక్ చిత్రానికి విషెస్ తెలియజేస్తున్నారు. అందుతున్న సమాచారం మేరకు గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్, మరికొంతమంది సెలెబ్రిటీలు హైదరాబాద్ లో అభిమానులతో కలసి ప్రీమియర్ షోలకు హాజరైనట్లు తెలుస్తోంది. తెలంగాణాలో ఒక జాతర తరహాలో భీమ్లా నాయక్ రిలీజ్ జరుగుతోంది. కానీ ఏపీలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. గిట్టుబాటు కానీ టికెట్ ధరలతో థియేటర్ యాజమాన్యాలు బిక్కు బిక్కు మంటున్నాయి.