
స్వర్గీయ నందమూరి తారక రామారావు స్మారకార్థం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 100 రూపాయల నాణేన్ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ తనయులు, కుమార్తెలు, అల్లుళ్ళు ఇతర కుటుంబ సభ్యుల సమక్షంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్ లో ఎన్టీఆర్ 100 రూపాయల నాణేన్ని విడుదల చేశారు. సోమవారం రోజు ఈ కార్యక్రమం జరిగింది.
ఎన్టీఆర్ గౌరవార్థం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం పట్ల దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో వీడియో బైట్ పోస్ట్ చేశారు. ' నాకు దైవ సమానులైన నందమూరి తారక రామారావు పేరుతో భారత ప్రభుత్వం 100 రూపాయల కాయిన్ విడుదల చేయడం సంతోషంగా ఉంది.
నెక్స్ట్ భారత ప్రభుత్వం ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వాలి. అలా చేస్తే నిజంగా తెలుగు జాతి గర్వించదగిన రోజు అవుతుంది అని రాఘవేంద్ర రావు అన్నారు. అందరూ పూనుకుని ఎన్టీఆర్ కి భారతరత్న తీసుకురావాలని రాఘవేంద్ర రావు కోరారు.
ఇదిలా ఉండగా ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల కార్యక్రమానికి లక్ష్మీ పార్వతికి ఆహ్వానం అందకపోవడం, జూ. ఎన్టీఆర్ హాజరుకాకపోవడం పట్ల సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ, నారా చంద్రబాబు నాయుడు, పురందేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వర్లు, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, గారపాటి లోకేశ్వరి, నారా బ్రాహ్మణి, ఇతర కుటుంబ సభ్యులంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నందమూరి బాలకృష్ణ, పురందేశ్వరి, భువనేశ్వరి రాష్ట్రపతితో వేదిక పంచుకున్నారు.