
కింగ్ నాగార్జున రూటు మార్చారు. చాలా కాలంగా నాగార్జున నుంచి స్టైలిష్, సాఫ్ట్ చిత్రాలు మాత్రమే వస్తున్నాయి. ఎట్టకేలకు నాగార్జున తన లోపల దాగున్న మాస్ కోణాన్ని బయటకి తీసారు. నేడు నాగార్జున తన 64వ జన్మదిన వేడుకల్ని సెలెబ్రేట్ చేసుకుంటున్నారు.
ఈ సందర్భంగా నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం నుంచి ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్ వచ్చింది. నాగార్జున తదుపరి చిత్ర టైటిల్ ఫస్ట్ లుక్ రివీల్ చేస్తూ మేకర్స్ ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ లో నాగార్జున యాటిట్యూడ్, గెటప్ ఊరమాస్ అనిపించేలా ఉన్నాయి. నాగ్ పాత్రకి తగ్గట్లుగానే 'నా సామిరంగ' అని టైటిల్ ఫిక్స్ చేశారు.
డెన్ లో బిర్యానీ మందుతో ఎంజాయ్ చేస్తున్న రౌడీల పనిపట్టే విధానం, నాగార్జున స్టైల్ యాటిట్యూడ్ కంప్లీట్ మాస్ అంతే. చివర్లో నాగార్జున తనదైన శైలిలో 'ఈసారి పండక్కి నా సామిరంగ' అంటూ డైలాగ్ చెబుతున్నాడు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నారు. విజయ్ బిన్నీ దర్శకుడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిత్తూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.
ఎర్రచొక్కా, లుంగీ, మాస్ గా బీడీ తాగుతూ నాగార్జున ఆకట్టుకుంటున్నారు. ఈ తరహాలో నాగార్జున మాస్ యాంగిల్ చూసి చాలా కాలమే అవుతోంది. ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. నాగార్జున చివరగా నటించిన ఘోస్ట్ మూవీ దారుణంగా నిరాశపరిచింది. బంగార్రాజు కూడా అంతంత మాత్రంగానే ఆడింది. దీనితో నాగార్జున నుంచి సాలిడ్ హిట్ కోసం అక్కినేని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.