
కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ మూడో కుమారుడైన పునీత్ రాజ్‌కుమార్ (Puneeth Rajkumar కన్నడనాట పవర్‌స్టార్‌గా గుర్తింపు, పాపులారిటీ, ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. విశేష సేవా కార్యక్రమాలతో ప్రజల మనసులో నిలిచిపోయారు. గతేడాది అక్టోబర్ 29న గుండెపోటుకు గురై తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. అభిమానులకు, ఫ్యామిలీకి, సినీ రంగానికి తీరని శోకం మిగిల్చారు. ఇప్పటికీ ఆయనను అభిమానులు గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. ఈలోగా అప్పు ఇంట మరో విషాదం చోటు చేసుకుంది. పునీత్ భార్య అశ్విని తండ్రి భగ్మనే రేవనాథ్(78) గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. పునీత్ మరణానంతరం ఆయన తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. దీంతో ఆరోగ్యం కొద్దికొద్దిగా క్షీణిస్తోంది. ఈక్రమంలో రేవనాథ్‌కు నిన్న ఉదయం గుండెపోటు కూడా వచ్చింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను బెంగళూరులోని ఎంఎస్ రామయ్య ఆస్పత్రికి తరలించారు. కానీ, పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
రేవనాథ్ గతంలో ఎన్‌హెచ్‌ఏఐ చీఫ్ ఇంజనీర్‌గా పని చేశారు. భర్త మరణంతో ఇప్పటికే శోకసంద్రంలో మునిగిపోయిన అశ్వినికి తండ్రి రేవనాథే కొంత ధైర్యంగా నిలిచాడు. ఆయన కూడా మరణించడంతో పునీత్ భార్య తట్టుకోలేని బాధను భరిస్తోంది. అయితే అల్లుడు పునీత్ లాగే రేవనాథ్ కూడా మరణానంతరం తన కళ్లను దానం చేశారు.
ఇక.. అప్పు నటించిన James చిత్రం మార్చి 17న రిలీజ్ కానుంది. ఇందులో పునీత్ రాజ్ కుమార్ సెక్యూరిటీ ఏజెంట్ గా కనిపించనున్నారు. ఇటీవల రిలీజైన ఈ మూవీకి సంబంధించిన టీజర్ ఆడియెన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అప్పును అభిమానులు జేమ్స్ చిత్రంలో చివరిసారిగా తెరపై చూడనున్నారు.