Puneeth Rajkumar Death: కర్నాటకలో భారీ బందోబస్త్, థియేటర్లు మూసివేత.. శోకసంద్రంలో అభిమానులు..

By Aithagoni RajuFirst Published Oct 29, 2021, 2:57 PM IST
Highlights

అభిమాన నటుడు పునీత్‌ రాజ్‌ కుమార్‌ మరణ వార్త విని బోరున విలపిస్తున్నారు అభిమానులు. కన్నీరు మున్నీరవుతున్నారు. సినీ ప్రముఖులు షాక్‌లోకి వెళ్తున్నారు. ఇది నిజం కాదని చెప్పండి అంటూ పోస్ట్ లు పెడుతున్నారు.

కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్ మరణంతో కన్నడ చిత్ర పరిశ్రమ తీవ్ర విషాదంలోకి వెళ్లింది. కేవలం 46ఏళ్ల వయసులో ఆయన గుండెపోటుతో మరణించడం జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. అభిమాన నటుడి మరణ వార్త విని బోరున విలపిస్తున్నారు. కన్నీరు మున్నీరవుతున్నారు. సినీ ప్రముఖులు షాక్‌లోకి వెళ్తున్నారు. ఇది నిజం కాదని చెప్పండి అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. బాలనటుడిగానే చరిత్ర సృష్టించిన పునీత్‌ మరణంతో కర్నాటక రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఆయనకు అత్యధిక అభిమానులున్న నేపథ్యంలో థియేటర్లు మూసివేసింది.

మరోవైపు విక్రమ్‌ ఆసుపత్రిలో పునీత్‌ రాజ్‌కుమార్‌ భౌతిక కాయం ఉంది. దీంతో ఆసుపత్రికి మూడు నాలుగు కిలోమేటర్ల మేరకు ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. ఆసుపత్రికి భారీగా అభిమానులు తరలి రావడంతో అక్కడి పరిసరాలు అభిమానులతో కిక్కిరిసిపోయాయి. వారి అర్తనాదాలతో మారుమోగుతుంది. పునీత్‌ మరణం నేపథ్యంలో మరి కాసేపట్లో కన్నడ సీఎం బసవరాజు బొమ్మై, అన్నయ్య శివరాజ్‌కుమార్‌ మీడియా ముందుకు రాబోతున్నారు. మరోవైపు మరికాసేపట్లో పునీత్ రాజ్‌ భౌతికకాయాన్ని తరలించనున్నారు. 

కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం ఆయన జిమ్‌లో వర్కౌట్‌ చేస్తుండగా ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యారు. దీంతో హుటాహుటిన బెంగుళూరులో విక్రమ్‌ ఆసుపత్రికి తరలించారు. వెంటిలేటర్‌పై ఆయనకు చికిత్స అందించారు. ఆయన్ని ప్రాణాలతో బతికించేందుకు విక్రమ్‌ ఆసుపత్రి వైద్యులు తీవ్రంగా శ్రమించారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఆసుపత్రి వైద్యులు అధికారికంగా ప్రకటించారు. దీంతో అటు అభిమానులు, ఇటు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నారు. 

కన్నడ కంఠీరావ రాజ్‌కుమార్‌ మూడో కుమారుడు పునీత్‌ రాజ్‌కుమార్‌. కన్నడపవర్‌స్టార్‌గా పేరుతెచ్చుకున్న ఆయన 1975మార్చి 17న జన్మించారు. నటుడిగానే కాదు ప్లేబ్యాక్‌ సింగర్‌గా, టెలివిజన్ ప్రజెంటర్‌గా ఉన్నారు 1976లో `ప్రేమదా కనికే` చిత్రంతో బాలనటుడిగా తెరంగేట్రం చేశారు. దాదాపు పదమూడు సినిమాల్లో బాలనటుడిగా మెప్పించారు. `అప్పు` సినిమాతో హీరోగా మారారు. `ఇడియట్‌` చిత్రానికి రీమేక్‌. పూరీ దర్శకత్వం వహించడం విశేషం.

హీరోగా దాదాపు 29 సినిమాల్లో నటించారు. `అభి`, `వీర కన్నడిగ`, `మౌర్య`, `ఆకాష్‌`, `నమ్మ బసవ`, `అజయ్‌`, `అరసు`, `మిలన`, `బిందాస్‌`, `రాజ్‌`, `పృథ్వీ`, `జాకీ`, `హంగామా`, `అన్న బాండ్‌`, `పవర్‌`, `రానా విక్రమ`, `చక్రవ్యూహ`,`దొడ్మనె హగ్డ్`, `రాజకుమార`, `అంజని పుత్ర` చిత్రాలతో పవర్‌ స్టార్‌గా ఎదిగారు. `చివరిగా ఆయన `యువరత్న` చిత్రంలో నటించారు. ఇది మంచి విజయం సాధించింది. ప్రస్తుతం `జేమ్స్`, `ద్విత్వ` చిత్రాల్లో నటిస్తున్నారు. 

click me!