ప్రముఖ నిర్మాత వి. మహేష్ మృతి!

By Sambi ReddyFirst Published Feb 25, 2024, 5:48 PM IST
Highlights

చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. నిర్మాత, రచయిత వి. మహేష్ కన్నుమూశారు. ఆయన మృతి నేపథ్యంలో చిత్ర ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. 
 

ప్రముఖ చలన చిత్ర, టీవీ నిర్మాత, రచయిత వి. మహేష్ (85) శనివారం రాత్రి చెన్నై లో గుండెపోటుతో మరణించారు. బాత్ రూమ్ నుంచి బయటికి వస్తూ కాలుజారి పడిన ఆయనను దగ్గరలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. “మాతృమూర్తి” చిత్రంతో  1975 లో వి. మహేష్ నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు. ఎన్టీఆర్ తో, దాసరి నారాయణ రావు దర్శకత్వంలో, “మనుష్యులంతా ఒక్కటే” (1976), లక్ష్మీదీపక్ దర్శకత్వంలో “మహాపురుషుడు” (1981), చిరంజీవి కోడి రామకృష్ణ కాంబినేషన్ లో “సింహపురి సింహం” (1983), బోయిన సుబ్బారావు దర్శకత్వంలో, సుమన్, భానుప్రియలతో “ముసుగు దొంగ” (1985), నిర్మించారు. 

మనుష్యులంతా ఒక్కటే చిత్రానికి ఆయన ఉత్తమ కథా రచయితగా నంది అవార్డును అందుకున్నారు. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ లో ప్రసారమైన “హరి భక్తుల కథలు” ధారావాహికకు ఆయన నిర్మాతే కాకుండా, రచయిత కూడా. ఆ ధారావాహికలో భాగమైన “విప్రనారాయణ” కు 2009వ సంవత్సరంలో ఉత్తమ టెలీ ఫిలింగా బంగారు నందితో పాటు, మరో మూడు విభాగాల్లో నంది పురస్కారాలను అందుకున్నారు. 

Latest Videos

తన అన్నయ్య ప్రముఖ కళా దర్శకులు స్వర్గీయ వి. వి. రాజేంద్ర కుమార్ తో కలసి, చిత్రాలకు ప్రచార సామగ్రిని తయారు చేసే సంస్థ “స్టూడియో రూప్ కళ”ను, చిత్ర నిర్మాణ సంస్థ “ఆదిత్య చిత్ర”ను నెలకొల్పారు. నెల్లూరు జిల్లా, కొరుటూరు వీరి స్వస్థలం. వి. మహేష్ అవివాహితులు. వి. మహేష్ మృతికి సినిమా, టెలివిజన్ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు తమ ప్రగఢ సంతాపం తెలియజేశారు. వి. మహేష్ అంత్యక్రియలు చెన్నైలో సోమవారం మధ్యాహ్నం జరుగుతాయని ఆయన మేనల్లుడు టెలివిజన్ నిర్మాత, దర్శకుడు వల్లభనేని మహీధర్ తెలిపారు.
 

click me!