`నారప్ప` ఓటీటీలో నా నిర్ణయం కాదు.. అది ఎంత వరకు న్యాయంః వివాదంపై నిర్మాత సురేష్‌ బాబు

By Aithagoni RajuFirst Published Jul 17, 2021, 3:54 PM IST
Highlights

 వెంకీ నటించిన `నారప్ప` చిత్రాన్ని ఈ నెల 20న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు సురేష్‌బాబు, కళైపులి ఎస్‌ థాను ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ నిర్మాతలపై ఎగ్జిబిటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

వెంకటేష్‌ నటించిన `నారప్ప` చిత్రం ఈ నెల 20న ఓటీటీలో విడుదల కాబోతుంది. అంతకు ముందే తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్ ఛాంబర్‌ నుంచి ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు పెద్ద సినిమాలు కొంత కాలం వెయిట్ చేయమని రిక్వెస్ట్ చేశారు. తాము సినిమాలపైనే ఆధారపడ్డామని, సినిమాని నమ్ముకుని థియేటర్‌, అందులో పనిచేసే సిబ్బంది, ఇతర వాళ్లు ఎంతో మంది ఉపాధి ఆధారపడి ఉందని వెల్లడించారు. అక్టోబర్‌ వరకు ఓపికగా ఉండమని కోరారు. 

కానీ వెంకీ నటించిన `నారప్ప` చిత్రాన్ని ఈ నెల 20న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు సురేష్‌బాబు, కళైపులి ఎస్‌ థాను ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ నిర్మాతలపై ఎగ్జిబిటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇది వివాదంగా మారడంతో తాజాగా నిర్మాత సురేష్‌బాబు స్పందించారు. సినిమా ఓటీటీ అనేది తన ఒక్కడి నిర్ణయం కాదన్నారు. కళైపులి ఎస్‌ థాను తీసుకున్న నిర్ణయమన్నారు. 

`సురేష్‌ ప్రొడక్షన్‌లో వచ్చే సినిమాల విడుదల నిర్ణయం నా చేతుల్లోనే ఉంటుంది. కానీ `నారప్ప` విషయంలో అది డిఫరెంట్‌. మేం ఇందులో భాగస్వాములం మాత్రమే. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకునే నిర్మాత ఎస్‌.థాను ఈ చిత్రాన్ని అమెజాన్‌లో విడుదల చేయాలని నిర్ణయించారు. కరోనా థర్డ్ వేవ్‌ దృష్ట్యా ఎవరూ నష్టపోకూడదనే ఈ నిర్ణయాన్ని స్వాగతించాం. ఎగ్జిబిటర్లకు నాపై అసంతృప్తి ఉండటంలో న్యాయం ఉంది. 

కానీ, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మన కుటుంబ సభ్యుల్నే థియేటర్‌కు పంపించడం లేదు. అలాంటిది ప్రేక్షకుల్ని థియేటర్లకు రమ్మని అడగడం న్యాయమా? తన సినిమాని ఎలాగైనా ప్రజలకు చేరువ చేసేందుకు నిర్మాత కష్టపడతాడు. భవిష్యత్తు ఓటీటీదే కావొచ్చు కానీ థియేటర్లు కూడా ఉంటాయి` అని సురేష్‌ బాబు తెలిపారు. ఈ వివాదంపై తన వరకు క్లారిటీ ఇచ్చేప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే ఇటీవల సినిమా నిర్మాతకి తనచిత్ర విడుదలపై సర్వహక్కులుంటాయని, ఎక్కడ విడుదల చేయాలనేది తన ఇష్టమని సురేష్‌బాబు చెప్పిన విషయం తెలిసిందే. 

click me!