
ఆర్ ఆర్ ఆర్ విజేతల సన్మాన కార్యక్రమం సాదాసీదాగా ముగిసింది. అటు గౌరవించిన వారిలో కానీ దాన్ని స్వీకరించిన వాళ్లలో కానీ జోష్ లేదు. ఏదో మొక్కుబడి వ్యవహారంలా సాగింది. మరోసారి నిర్మాత దానయ్య రాజమౌళి అండ్ టీమ్ తో డిస్టెన్స్ మైంటైన్ చేశారు.ఒకవేళ వీరే దూరం పెట్టారో తెలియదు. ఇక హీరోల సంగతి సరేసరి. రామ్ చరణ్ దుబాయ్ లో ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్ లోనే ఉన్న ఎన్టీఆర్ కనీసం తొంగిచూడలేదు. విజేత కీరవాణి ప్రసంగం పస లేకుండా సాగింది. ఏదో ఎజెండా పెట్టుకొని మాట్లాడారన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. రాజమౌళి గురించి కానీ ఆర్ ఆర్ ఆర్ మూవీ గురించి కానీ నటులు, సాంకేతిక నిపుణుల గురించి కానీ ఆయన గొప్పగా మాట్లాడలేదు. చెప్పాలంటే ఆయన గురించి ఆయన కూడా మాట్లాడుకోలేదు.
ఆస్కార్ విజయం నన్నేమీ ఎగ్జైట్ చేయలేదన్నారు. దీని కంటే నా ఫస్ట్ సాంగ్ రికార్డు చేసిన రోజు కిక్ ఫీలయ్యాను అన్నారు. అసలు ఆస్కార్ మీదే మోజు లేదు. దాన్ని గెలవాలన్న కసి లేదు. దాని విలువ మహానుభావుడు రామోజీరావు చెబితే కానీ నాకు తెలియలేదన్నారు. తన సన్మాన కార్యక్రమంలో సంబంధం లేని రామోజీరావు టాపిక్ తీసుకొచ్చి రెండు నిమిషాల రాజమౌళి రేంజ్ ఎలివేషన్ ఇచ్చారు. చిత్ర దర్శకుడు రాజమౌళి గురించి కూడా ఆయన అంత సేపు మాట్లాడకపోవడం కొసమెరుపు. ఎన్టీఆర్, చరణ్ పేర్లు ఆయన నోటి నుండి రాలేదు. కేవలం రాజమౌళి, ప్రేమ్ రక్షిత్ కి క్రెడిట్ ఇచ్చారు.
కాగా ఆస్కార్ విజేతల సన్మాన సభపై నట్టి కుమార్ విమర్శలు గుప్పించారు. ఆస్కార్ విజేతలను గౌరవించుకోవడం మంచి విషయమే. కానీ నిర్వహించే తీరు ఇదేనా అంటూ దుయ్యబట్టారు. అసలు ఆర్ ఆర్ ఆర్ చిత్ర నిర్మాత లేకుండా సన్మాన కార్యక్రమం ఏమిటీ? ఏపీ ప్రభుత్వ పెద్దలు ఈ కార్యక్రమానికి రాలేదు. కేవలం సినిమాటోగ్రఫీ మంత్రి హాజరయ్యారు. రెండు రాష్ట్రాల పెద్దలతో సంప్రదింపులు జరిపి వేడుక ఘనంగా చేస్తే బాగుండేది. కొందరికి ఈవెంట్ గురించి తెలియదు. ఆహ్వానం లేదు.
ఈసీ అనుమతి లేకుండా నిర్మాత మండలి నుండి రూ. 25 లక్షలు తీసి ఖర్చు చేశారు. తెలంగాణా ప్రభుత్వం చిత్ర పరిశ్రమకు మంచి చేస్తామని చాలా హామీలు ఇచ్చారు. కానీ చిన్న సినిమాను పట్టించుకోవడం లేదు. పెద్ద సినిమాలకు మాత్రమే న్యాయం జరుగుతుంది. ఐదో షో ప్రతిపాదన అలానే ఉండిపోయింది. తెలంగాణా కంటే ఏపీ నుండి అధిక ఆదాయం వస్తుంది. అన్ని సంస్థలు జీఎస్టీ తెలంగాణా ప్రభుత్వానికి కడుతున్నాయి. పరిశ్రమలో ఏపీ, తెలంగాణా అనే బేధాలు లేవు. కలిసి కట్టుగా మెలుగుతున్నాం అన్నారు.