
సితార ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి వచ్చే సినిమాలంటే మినిమమ్ గ్యారంటీ అనే బ్రాండ్ పడింది. ఆయా సినిమాలపై కొంత అంచనాలు నెలకొన్నాయి. కానీ దానికి బ్రేకులు వేసింది `బుట్టబొమ్మ`. గత వారం వచ్చిన `బుట్టబొమ్మ` మూవీ దారుణంగా పరాజయం చెందింది. కొత్త టీమ్‌తో చేసిన ఈ మూవీ దారుణంగా ఫ్లాప్ అయ్యింది. మొదటి షో నుంచే డిజప్పాయింట్ చేసింది. ఈ సినిమా మలయాళంలో రూపొందిన `కప్పెలా`కి రీమేక్. మూడేళ్ల క్రితం వచ్చిన ఈ మూవీ అక్కడ విజయం సాధించింది. దాన్ని తెలుగులో `బుట్టబొమ్మ`గా రీమేక్ చేశారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ.
అయితే ఈ సినిమా స్లోగా సాగడం, కంటెంట్‌లో దమ్ము లేకపోవడంతో తెలుగు ఆడియెన్స్ ని నిరాశ పరిచింది. అయితే తాజాగా ఈ చిత్ర ఫలితంపై నిర్మాత సూర్య దేవరనాగవంశీ స్పందించారు. ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన `బుట్టబొమ్మ` ఫ్లాప్ గురించి ఓపెన్ అయ్యారు. మలయాళ మూవీ నచ్చి రీమేక్ చేయాలనుకున్నా. కానీ మూడేళ్లలో పరిస్థితులు మారిపోయాయి. అప్పుడు బాగానే ఉంది, కానీ ఇప్పుడు ఆడియెన్స్ అభిరుచి మారిపోయిందన్నారు. దీంతో ఈ సినిమా ఫెయిల్ అయ్యింది.
`ఈ సినిమాని చూసిన బాబాయి రాధాకృష్ణ, దర్శకుడు త్రివిక్రమ్ ఫలితాన్ని ముందే ఊహించారు. అందుకే మేం డిస్ట్రిబ్యూటర్ల నుంచి డబ్బులు తీసుకోకుండానే రిలీజ్ చేశామని తెలిపారు నాగవంశీ. ఆయన ప్రస్తుతం `సార్` చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ధనుష్ హీరోగా నటించిన చిత్రమిది. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తుంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఆయన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
చదువు గొప్పతనం చెప్పే చిత్రమిది. చదువు వెనకాల పడే స్ట్రగుల్‌ని తెలియజేసేలా ఈ చిత్రం ఉండబోతుందని చెప్పారు. కచ్చితంగా హిట్ అవుతుందని, ధనుష్ చాలా బాగా చేశారని, తెలుగు ఆడియెన్స్ కి కనెక్ట్ అవుతుందని చెప్పారు. దీంతోపాటు మహేష్-త్రివిక్రమ్ సినిమా అప్‌డేట్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని ఆగస్టులో విడుదల చేస్తామన్నారు. `టిల్లు స్వ్కైర్` ని జులైలో విడుదల చేయాలనుకుంటున్నామని చెప్పారు నాగవంశీ.