హాలీవుడ్ లో ఒక స్థాయికి రావడానికి తనకు పదేళ్ల సమయం పట్టినట్లు ప్రియాంక చోప్రా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
ప్రియాంక చోప్రా నటించిన సిటాడెల్ సిరీస్ ఏప్రిల్ 28 నుండి ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా ఆమె వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం హాలీవుడ్ లో ఒక స్థాయికి వచ్చానంటున్న ప్రియాంకా చోప్రా మొదట్లో అక్కడ ఎదురైన అనుభవాలు వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ... 'బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిన నేను హాలీవుడ్ లో కొత్త నటిలా కెరీర్ ప్రారంభించాను. ఆడిషన్స్ ఇవ్వాల్సి వచ్చింది. ఆడిషన్స్ లో పాల్గొనడం తప్పని అనడం లేదు. ఆడిషన్స్ పరిశ్రమలో ఉన్న పరిచయాలతో సంబంధం లేకుండా ప్రతిభ మీద ఆధారపడి ఉంటాయి. ఆడిషన్స్ లో పాల్గొని ఆఫర్స్ తెచ్చుకోవడం హాలీవుడ్ లో నాకో కొత్త అనుభూతి...' అన్నారు.
'ఇప్పుడు పరిస్థితి మారింది. సిటాడెల్ కి ఆడిషన్స్ ఇవ్వకుండానే సెలెక్ట్ అయ్యాను. అంతగా నన్ను నేను నిరూపించుకున్నాను. పోస్టర్స్ లో కూడా నాకు సమ భాగం దక్కుతుంది. మేల్ యాక్టర్స్ కి సమానంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాను. హాలీవుడ్ కి వచ్చిన పదేళ్లలో నేను సాధించిన ఘనత ఇది. ఇప్పుడు ఇండియన్స్ స్టార్స్ ప్రతి చోటా ఉంటున్నారు. తెర మీద తెర వెనుక తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారు...' అని ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చారు.
ప్రియాంక చోప్రా బాలీవుడ్ మీద పూర్తిగా ఫోకస్ తగ్గించారు. హాలీవుడ్ లో చిత్రాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల హిందీ చిత్ర పరిశ్రమ మీద ఆరోపణలు చేశారు. కొందరు తనకు అవకాశాలు రాకుండా చేశారని. బాలీవుడ్ రాజకీయాల్లో నేను ఇమడలేక పోయానని, ఈ క్రమంలో కొందరితో గొడవలు అయ్యాయని. అందుకే బాలీవుడ్ కి దూరమయ్యానంటూ తన అసహనం బయటపెట్టారు.
ప్రియాంక చోప్రా 2018లో అమెరికన్ సింగర్ అండ్ యాక్టర్ నిక్ జోనాస్ ని వివాహం చేసుకున్నారు. నిక్ వయసులో ప్రియాంక కంటే 10 ఏళ్ళు చిన్నవాడు కావడం విశేషం. ఈ విషయంలో ఆమె పలుమార్లు ట్రోల్స్ కి గురయ్యారు. లాస్ ఏంజెల్స్ లో లగ్జరీ హౌస్ కొన్న ప్రియాంక భర్తతో అక్కడే కాపురం పెట్టారు. సరోగసి ద్వారా ప్రియాంక ఓ పాపకు తల్లయ్యారు.