
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం ఆయన కుటుంబ సభ్యలకు తీవ్ర వేదనని మిగిల్చింది. అభిమానులు, భారత చిత్ర పరిశ్రమ ఊహించని షాక్ కు గురయ్యాయి. విధి ఎంత విచిత్రమైనదో ఈ హృదయాలు బద్దలయ్యే సంఘటన బట్టి అర్థం అవుతుంది. గురువారం పునీత్ రాజ్ కుమార్ గుండె పోటుతో మరణించారు. కేవలం 46 ఏళ్ల పిన్న వయసులో పునీత్ మరణించడం అందరిని కలచి వేస్తోంది.
సెలెబ్రిటీలు Puneeth rajkumar death పై దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలియజేస్తున్నారు. పునీత్ రాజ్ కుమార్ మరణాన్ని ప్రధాని నరేంద్ర మోడీ.. విధి ఆడిన క్రూరమైన ఆటగా అభివర్ణించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్రధాని మోడీతో పాటు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తమిళనాడు సీఎం స్టాలిన్.. ఇతర రాజకీయ ప్రముఖులు పునీత్ మరణంపై దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలియజేశారు.
ప్రధాని మోడీ ట్వీట్ చేస్తూ.. విధి ఆడిన క్రూరమైన ఆట కారణంగా ప్రతిభావంతుడైన నటుడు పునీత్ రాజ్ కుమార్ మనకు దూరం అయ్యారు. తదుపరి తరాలు ఆయన అద్భుతమైన వ్యక్తిత్వాన్ని, పనితనాన్ని గుర్తుంచుకుంటాయి. ఇది మరణించాల్సిన వయసు ఏమాత్రం కాదు. ఓం శాంతి అని సంతాపం తెలియజేశారు.
'పునీత్ రాజ్ కుమార్ మరణ వార్త విని తీవ్రంగా కలత చెందా. కన్నడ సినిమా అగ్ర నటుల్లో ఆయన ఒకరు. పునీత్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి' అని కేరళ సీఎం పినరై విజయన్ ట్వీట్ చేశారు.
'పునీత్ అకాల మరణ వార్త నన్ను షాక్ లోకి నెట్టివేసింది. ఆయన కన్నడ లెజెండ్రీ నటుడు రాజ్ కుమార్ తనయుడు కూడా. దశాబ్దాల కాలంగా మా రెండు కుటుంబాల మధ్య సాన్నిహిత్యం కొనసాగుతోంది. వ్యక్తిగతంగా కూడా నాకు ఇది తీవ్ర విషాదం' అని తమిళనాడు సీఎం స్టాలిన్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.
'కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం ప్రజలకు మరియు సినీ రంగానికి తీరని లోటు. ఆయన మరణంతో ఈ సినిమా ఒక అద్భుతమైన నటుడిని కోల్పోయింది. ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని భగవంతుడు వారి కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా' అంటూ రాజ్య సభ సభ్యులు రాజీవ్ చంద్రశేఖర్ ట్వీట్ చేశారు.
'ప్రముఖ కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ అకాల మరణంతో కలత చెందాను. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన తర్వాత అపూర్వ నటుడిగా, నేపథ్యగాయకుడిగా, టీవీ వ్యాఖ్యాతగా, నిర్మాతగా తనదైన ముద్ర వేశారు. స్వతహాగా ఆయన ప్రతిభ ఉన్న వ్యక్తి' అంటూ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు.
'కన్నడ నటులు పునీత్ రాజ్ కుమార్ కుటుంబానికి, స్నేహితులకు, అభిమానులకు నా ప్రఘాడ సానుభూతి' అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు