వివాదంలో “జై భీమ్”… ఆ సీన్ పై విమర్శలు

By Surya PrakashFirst Published Nov 3, 2021, 2:30 PM IST
Highlights

సూర్య నటించిన తాజా చిత్రం “జై భీమ్”. జ్ఞానవేల్ రాజా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ముఖ్యమంత్రి నుంచి సామాన్యుల వరకు అందరిని ఫిదా చేసేస్తోంది. నవంబర్ 2న అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. 

తమిళ  స్టార్ హీరో సూర్య లాయర్ గా నటించిన సినిమా ‘జై భీమ్’. ఈ లీగల్ డ్రామా నిన్న దీపావళి కానుకగా ఓటీటిలో రిలీజైంది. ఈ చిత్రాన్ని  టి. జె. జ్ఞానవేల్ దర్వకత్వంలో సూర్య, జ్యోతిక కలిసి తమ 2డీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో నిర్మించారు. అమెజాన్ ప్రైమ్ లో నవంబర్ 2న విడుదలైన ఈ సినిమాపై ఒకవైపు ప్రశంసల వర్షం కురుస్తున్నాయి. అయితే అదే సమయంలో సోషల్ మీడియాలో  విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దానికి కారణం సినిమాలో ప్రకాష్ రాజ్ ఓ వ్యక్తి చెంప పగలగొట్టే సీన్. 

వివరాల్లోకి వెళితే....ఈ చిత్రంలో ఐజీ పాత్రలో నటించిన ప్రకాష్ రాజ్ కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఓ వ్యక్తిని విచారిస్తాడు. సౌత్ భాషల్లో విడుదలైన ప్రకారం ఆ సమయంలో ఆ సదరు వ్యక్తి హిందీలో మాట్లాడతాడు. అప్పుడు ప్రకాష్ రాజ్ అతని చెంప పగలగొట్టి, స్థానిక భాషలో మాట్లాడమంటాడు. అయితే హిందీలో మాత్రం ఈ సన్నివేశాన్ని ‘నిజం చెప్పు’ అనేలా డబ్ చేశారు. దీంతో ఇప్పుడు ఈ సీన్ పై కాంట్రవర్సీ మొదలైంది. హిందీ భాషను తక్కువ చేశారంటూ మండిపడుతున్నారు నెటిజన్లు. అయితే చిత్ర టీమ్ మాత్రం తమకు అలాంటి ఉద్దేశం లేదని, కేవలం కథాపరంగానే ఆ సన్నివేశం వచ్చిందని సమాధానం చెప్తున్నారు.

 కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో సమాజంలో అణగారిన వర్గాలపై చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని కొందరు పెద్ద మనుషులు చేస్తున్న దారుణమైన పనుల గురించి చూపించారు.  సామాజిక కథాంశంతో రూపొందిన ఈ సినిమా అందరి మనసులను గెలుచుకుంటోంది. అన్యాయంగా ఓ కేసులో చిక్కుకున్న పేద ఆదివాశి కుటుంబం తరపున పోరాడే లాయర్ గా సూర్య నటన, కథ ఆలోచింపజేసే విధంగా ఉంది. ఈ సినిమాను సూర్య, జ్యోతిక కలిసి తమ సొంత నిర్మాణ సంస్థలో నిర్మించారు.

ఈ సినిమాపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రత్యేకంగా స్పందించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. “జై భీమ్” ప్రత్యేక ప్రీమియర్ షోను వీక్షించిన సీఎం స్టాలిన్ సినిమాపై తన అభిప్రాయాన్ని మనస్ఫూర్తిగా సుదీర్ఘ వివరణతో పోస్ట్ చేశారు. “జై భీమ్ మూవీ చూశాక నా హృదయం బరువెక్కింది. నోట మాట రాలేదు. రాత్రంతా నిద్రపట్టలేదు. ఆ సినిమానే మదిలో మెదిలింది” అంటూ సోషల్ మీడియాలో సుదీర్ఘ లేఖను పోస్ట్ చేశారు. ఇంకా ఆయన సూర్యతో పాటు చిత్రబృందాన్ని కూడా ప్రశంసలతో ముంచెత్తారు. ప్రస్తుతం ఈ సినిమా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. 
 

click me!