
ప్రభాస్ ఇప్పుడు బాక్సాఫీస్ బాహుబలిగా మారారు. ఆయన సినిమాలు అన్నీ దాదాపు పాన్ ఇండియా స్దాయిలో రూపొందుతున్నాయి. అలాగే బడ్జెట్ లు కూడా ఓ రేంజిలో ఉంటున్నాయి. వరస పెట్టి సినిమాలు ఫినిష్ చేసే పనిలో ఉన్న ఆయన ఆ సెట్ నుంచి ఈ సెట్ కు పరుగులు పెడుతున్నారు. జూన్ లో ఆదిపురుష్ చిత్రం రిలీజ్ అయితే సలార్ సెప్టెంబర్ రిలీజ్ కు వస్తోంది. ఇక ప్రాజెక్టు కె అయితే జనవరి 2024న రిలీజ్ అవుతోంది. ఇలా ఏడు నెలల గ్యాప్ లో మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇది మామూలు విషయం కాదు. ఈ మూడు సినిమాల బడ్జెట్ లు కలిపి 1500 కోట్లు దాకా ఉంది. దాంతో ట్రేడ్ లో ఇప్పుడు ప్రభాస్ గురించే మాటలు జరుగుతున్నాయి. రాబోయే సంవత్సరం అంతా దాదాపు ప్రభాస్ మేనియా కనపడుతుందని అంచనా వేస్తున్నారు.
అయితే ఇక్కడే పెద్ద టాస్క్ ఉంది. బాహుబలి సూపర్ డూపర్ హిట్ కావడంతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. దీంతో ప్రభాస్ స్టార్ డమ్ కూడా పెరిగింది. కానీ, బాహుబలి లాంటి విజయాన్ని ఇప్పటి వరకు అందుకోలేకపోయాడు. సాహో, రాధే శ్యామ్ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలయ్యాయి. దాంతో ఓ ప్రక్కన టెన్షన్ గానూ ఉన్నారు.
ఆదిపురుష్ విషయానికి వస్తే 2023లో విడుదల అవుతున్న ప్రభాస్ చిత్రం ఆదిపురుష్. ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి వీఎఫ్‌ఎక్స్ విషయంలో విమర్శలు వచ్చాయి. భారీ ట్రోలింగ్ తర్వాత, మేకర్స్ దాని విడుదలను వాయిదా వేశారు. మళ్లీ వీఎఫ్‌ఎక్స్ పనులు చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా బడ్జెట్ రూ. 450 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. ఇందులో రాముడి పాత్రలో ప్రభాస్, కృతి సనన్ సీత పాత్రలో కనిపించనున్నారు.
ఇక సలార్ విషయానికి వస్తే.. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమాలో ప్రభాస్ ను ఎలా చూపించబోతున్నారా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సలార్ నుంచి ప్రభాస్ లుక్ విడుదలైనప్పటి నుంచి అభిమానులలో ఆసక్తి పెరిగింది. సలార్ పూర్తి స్దాయి యాక్షన్ డ్రామా. ఇది రూ.250 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందించనున్ననట్లు సమాచారం.
ఇక అత్యంత భారీ సినిమా ప్రాజెక్ట్ కె. మహానటి వంటి సంచలనాత్మక చిత్రంతో అందరినీ తన వైపుకి తిప్పుకున్న డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీస్టారర్ మూవీ ప్రాజెక్ట్ కె. ఇందులో ప్రభాస్‌కు జోడీగా దీపికా పదుకొణె నటిస్తోంది. అమితాబ్ బచ్చన్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాపై భారీతీయప్రేక్షకుల్లో ఓ రేంజిలో క్రేజ్ ఉంది. దాదాపు రూ. 400 కోట్ల బడ్జెట్‌తో ప్రాజెక్ట్ కె రూపొందుతున్నట్లు సమాచారం. మరో ప్రక్క డైరెక్టర్ మారుతీతో ఓ సినిమా, అలాగే ప్రభాస్ 25వ చిత్రం స్పిరిట్‌ని సందీప్ రెడ్డి వంగా రూపొందిస్తున్నారు.